ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 2: పాఠశాలలో సిలిండరుండగా కట్టెల పొయ్యిపై వంట చేయడమేమిటని ప్రధానోపాధ్యాయుడిపై కలెక్టర్ సందీప్‌కుమార్ సీరియస్ అయిన ఘటన మంగళవారం జరిగింది. సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. అందులో భగాంగా వెంకటాపూర్ పాఠశాలను తనిఖీ చేసి కట్టెల పొయ్యిపై వంట చేయడం చూసి ఆగ్రహించారు. పాఠశాలను తనిఖీ చేస్తున్న సమయంలోనే తరగతి గది ముందు మధ్యాహ్నం భోజన నిర్వాహకులు కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా వచ్చిన పొగను గమనించి ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణను పిలిచి సీరియస్ అయ్యారు.
ప్రత్యేకించి వంట కోసం ఓ గది ఉండగా తరగతి గదుల ముందు వంట చేయడమేమిటన్నారు. వంట చేస్తున్న వారిని తొలగించి మరో గ్రూపు సభ్యులకు వంట చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. అంతకు ముందు పోతిరెడ్డిపల్లిలోని ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ పాఠశాలను సందర్శించారు. గ్రామపంచాయతీ ఆవరణలో పేరుకు పోయిన చెత్త, నీటి నిల్వను గమనించి కార్యదర్శిని పిలిచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని అన్నారు.