Chalmeda Lakshmi Narasimharao | వేములవాడ, ఫిబ్రవరి 18 : వేములవాడ మున్సిపల్ పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అణగారిన వర్గాల బిడ్డలు మన బీసీ బిడ్డ వేములవాడ ఎమ్మెల్యేకు కనిపించలేదా..? అని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అని ప్రశ్నించారు.
బుధవారం వేములవాడలోని నివాసంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. వేములవాడ పురపాలక సంఘం కౌన్సిలర్ ఎన్నికల్లో బీసీల తర్వాత అత్యధికంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గెలిచినా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రెండు పదవులు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. ఇతర సామాజిక వర్గాలపై ఇంత వివక్షత పనికిరాదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో విప్‌గా కొనసాగుతున్న ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థిని ప్రలోభానికి గురిచేసి రాజ్యాంగాన్ని అవమానపరిచారన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నుండి వచ్చిన వలసవాదులకు పదవులు దక్కాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లే కేసీఆర్‌ను ఇంకా గుండెల్లో పెట్టుకున్నారని అర్థమవుతుందని అన్నారు. గెలిచినది 5 ఐదు స్థానాలు అయినా మరో ఐదు స్థానాల్లో అతి తక్కువ మెజారిటీతో పలుకుబడితో ఓడించారని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో ఏళ్లుగా పడావు పడిన పనులు చేస్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే.. రెండున్నర ఏండ్లలో ఏం చేశారో కనీసం ప్రజలకైనా చెప్పాలన్నారు. రాజన్నగుడికి రూ.150 కోట్లు వెచ్చించామని చెబుతూ.. డబ్బా కొడుతున్న ఆది శ్రీనివాస్ తమ ప్రభుత్వ హయాంలో సేకరించిన 35 ఎకరాలలోనే అభివృద్ధి జరుగుతుందన్న విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. ప్రజల్లో మీరు అత్తెసరు మార్కులతోనే పాస్ అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనందుని పూర్తి మెజార్టీ రాలేదని విమర్శించారు.
ఈ సమావేశంలో వేములవాడ పట్టణ కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, వెంగళ అనిత, వాసాల లావణ్య సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేశ్, గన్నమనేని రామారావు, సిరిగిరి చందు, నాయకులు గుడూరి మధు, గుడిసె సదానందం, సలీమ్, రేగుల రాజేశం, ఉల్లెందుల లక్ష్మీ హన్మంతు, నిమ్మశెట్టి రాజు, గోస్కుల నర్సయ్య, పబ్బ మహేశ్, మొట్టల మహేశ్, పైడి శ్రీనివాస్, చేపూరి రవీందర్, సందీప్, ప్రశాంత్‌రావు, కనుకయ్య, లైశెట్టి సంతోష్, నీరటి మల్లేశం, పెద్ది లతరాజు, రాధాకిషన్‌రావు, సత్తిరెడ్డి, చందనం శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, అంజద్, ఉమర్, రఫీక్, షాహిద్, అసద్, మండల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య తదితరులు ఉన్నారు.