రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) 15 డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జోరందుకున్నది. గ్రామీణ ప్రాంత మహిళా ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సజావుగా పోలింగ్..
సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని 255 గ్రామ పంచాయతీల్లో 202 పోలింగ్ కేంద్రాలు, 252 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఎక్కువ సంఖ్య లో కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా రద్దీ ఏర్పడలేదు. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఎన్నికల అధికారులు బీ మమత, సుమిత్ర జిల్లాలో పర్యటించి, పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించారు.
రికార్డు స్థాయిలో ఓటింగ్
సెస్ ఎన్నికలు జిల్లాలో పండుగ వాతావరణాన్ని తలపింప చేశాయి. మొత్తం 15స్థానాలకుగాను 75 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సెస్ పరిధిలో మొత్తం 87,130 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ 75 నుంచి 80శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ, ఈ సారి మాత్రం 73,189 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెస్ చరిత్రలోనే రికార్డు స్థాయి లో 84 శా తం నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, ఇల్లంతకుంట, వీర్నపల్లి, వేములవాడ టౌన్ 2 స్థానాల్లో అత్యధికంగా 90 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సిరిసిల్ల టౌన్1లో 77, సిరిసిల్ల టౌన్-2లో 76, వేములవాడ టౌన్-1లో 75శాతం నమోదైంది. మిగిలిన అన్ని స్థానాల్లో 80శాతం పైనే నమోదు కావ డం విశేషం.
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం
252 పోలింగ్ బూత్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల అధికారులు ప్రత్యేక వాహనాల్లో వేములవాడ రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూం లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమోరాలు, పోలీసుల భద్రతతో కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 26న సోమవారం ఓట్లను లెక్కించడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 27 మంగళవారం ఆఫీస్ బేరర్ల ఎన్నిక ఉంటుందని ఎలక్షన్ అధికారి సుమిత్ర తెలిపారు.
గులాబీ గెలుపు ధీమా..
సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు దారుల అఖండ విజయం సాధించడం ఖాయం గా కనిపిస్తున్నది. జిల్లాలో శనివారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. గెలుపు ఏకపక్షమని తెలిసిపోతున్నది. మొత్తం 84 శాతం పోలింగ్ నమోదు కాగా, అందులో 70 శాతానికిపైగా ఓట్లు తమవేనని గులాబీ పార్టీ నాయకులు చెబుతు న్నారు. ఓటింగ్‌కు ముందు రోజు మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్‌లో ఇచ్చిన సందేశం ప్రజలను ఆలో చింపజేసిందని, అందుకే జనచైతన్యం కనిపిం చిందని అంటున్నారు. ప్రతిపక్షాలు ఎంత ప్రలోభ పెట్టినా.. ఎన్నిడబ్బులు వెదజల్లినా వారి పాచికలు పారలేదని, ప్రజలంతా అభివృద్ధి, సంక్షేమం వైపే నిలిచారని, తమకే స్పష్టమైన మెజారిటీ ఉందని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు.