గంభీరావుపేట : మండలంలోని లింగన్నపేటకు చెందిన మండే సతీష్ (32) యువకుడు శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారుణ యువకుడిని బీరు సీసాలతో మెడ, కడుపుపై పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో రక్తపు మడుగులో సతీష్ మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు గొర్రెల కాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
సంఘటన స్థలాన్ని డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ ప్రేమానందం పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు సతీష్ ను హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మృతునికి భార్య భార్గవి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సతీష్ మృతితో లింగన్నపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.