KTR | సిరిసిల్ల రూరల్/ సిరిసిల్ల టౌన్, మార్చి 2: కేసీఆర్ సర్కారు హయాంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి సిద్ధం చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు సైతం పంటలు సాగు చేసుకున్నారని వారికి తప్పనిసరిగా నీళ్లు అందించాలని నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్‌కు సూచించారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో కోనరావుపేట ప్రజాప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. పంటలు ఎండిపోతున్నాయని.. రిజర్వాయర్ నింపి నీళ్లు అందివ్వాలని కోరారు. దీంతో వెంటనే కేటీఆర్ మిడ్ మానేరు ఎస్ఈ సుమతితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. తర్వాత ఈఎన్సీ అనిల్‌కుమార్ ఫోన్లో మాట్లాడారు.
మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి సిద్ధం చేశామని రైతులు సైతం భారీగా పంటలు వేసుకున్నారరని ఈఎన్సీ అనిల్ కుమార్‌తో కేటీఆర్ అన్నారు. మిడ్ మానేరులో 16 టీఎంసీల నీటి నిలువ ఉందని వెంటనే రిజర్వాయర్‌లోకి విడుదల చేయాలని కోరారు. ఇటీవల కూడా ట్రయల్ రన్ చేయడంతో రైతులు 80 నుంచి 90మోటార్లు తెచ్చుకుని, విపరీతంగా పంటలు వేసుకున్నారని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే దాదాపు 2 వేల ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతానికి 0.5 టీఎంసీల నీటి సరఫరా చేస్తే పంటలు ఎండకుండా కాపాడవచ్చని, తర్వాత మరికొంత నీటిని విడుదల చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడానని మీకు కూడా తాను ఈ విషయాన్ని చెబుతానని అన్నారని కేటీఆర్ తెలిపారు. మిడ్ మానేరు నుంచి మల్కపేటకు నీరు చేరేందుకు సుమారు 48 గంటల సమయం పడుతుందని కేటీఆర్ అన్నారు.