సిరిసిల్ల రూరల్, మార్చి 16: బీఆర్ఎస్ సీనియర్ నేత, సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును (Matla Madhu) పోలీసులు అరెస్టు చేశారు. 2013 సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్ల మధుకు పొన్నం ప్రభాకర్ రూ.40 వేలు ఇచ్చాడని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ (టోనీ) ఆరోపించారు. దీటుగా స్పందించిన మధు.. తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈనెల 16న మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు వచ్చి, తనపై చేసిన కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గత పది రోజుల నుండి పొలిటికల్ వార్, వరస ప్రెస్ మీట్లు జరుగుతుండడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా చర్చపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనూహ్యంగా తంగళ్లపల్లి పోలీసులు జిల్లెల్లకు చేరుకొని, మాట్ల మధును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాట్ల మధును పోలీసులు అరెస్ట్ చేయడంతో బిఆర్ఎస్ నేతలు భారీగా తంగళ్లపల్లి స్టేషన్‌కి చేరుకుంటున్నారు. దమ్ముంటే పొన్నం ప్రభాకర్ చర్చకు వచ్చి , ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్‌పై కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. లేనట్లయితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్‌కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు..
బిఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధును పోలీసులు అదుపు లోకి తీసుకోవడంతో భారీగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజ బింకార్ రాజన్నతోపాటు పార్టీ నేతలు పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. మధుకు మద్దతుగా చేరుకొని, సంగీభావం తెలిపారు.