women Degree College | వేములవాడ, జూన్ 10 : వేములవాడ నియోజకవర్గ పరిధిలో మహిళల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీసీ విద్యార్థి సంఘం నాయకుడు బాలుసాని వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి విద్యను అందిస్తున్నాయని ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభుత్వరంగంలో రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడంతో, విద్యార్థులపై ఫీజుల మోత మోపుతున్నట్లు వంశీ కృష్ణ తెలిపారు. ముఖ్యంగా పరీక్షల సమయాల్లో విద్యార్థులపై ఒత్తిడి తేవడం, ఫీజుల పేరుతో మానసికంగా వేధించడమన్నవి విపరీతంగా పెరిగాయని అన్నారు.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మహిళల కోసం ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇది మహిళా విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు అండగా నిలుస్తుందని వంశీ కృష్ణ తెలిపారు.