Vemulawada Road Accident | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్చన, రంజీ ప్రభాకర్ అనే ఇద్దరు కూలీలు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా పూణే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం ఇటీవల తెలంగాణకు వచ్చారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలంలోని జెగ్గారావుపల్లె వద్ద కొదురుపాకకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ వరినాట్లకు కూలీలుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాడు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో వరి నాట్లు వేసేందుకు 17 మంది మహిళలు, ఆరుగురు పురుషులు వెళ్లారు. నాట్లు ముగించుకుని సాయంత్రం డ్రైవర్‌తో సహా మొత్తం 24 మంది టాటా ఏస్ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. వారు అనుపురం వద్దకు చేరుకోగానే వెనుక నుంచి ఆర్టీసీ అద్దె వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో దాదాపు పది అడుగుల దూరంలోకి ఎగిరిపడి పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వాసుదేవ్ (35) కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్‌తో పాటు 23 మందదికి తీవ్ర గాయాలయ్యాయయి. వారిని హుటాహుటిన వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. అర్చన, రంజీ ప్రభాకర్ అనే ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు.