BRS Party | సిరిసిల్ల రూరల్, మార్చి 30 : సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై వేధింపులు, పోలీసుల కేసులు ఆగడం లేదు. వాట్సాప్‌లో అభ్యంతరకర పోస్ట్ పెట్టాడని తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత నేత బొడ్డు శ్రీధర్ని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయాన్నే శ్రీధర్ నివాసానికి వెళ్లి.. అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేత రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఫోన్‌ని సీజ్ చేసినట్లు ఏఎస్ఐ రామ్మోహన్రావు తెలిపారు. ఉగాది పండుగ రోజున బీఆర్ఎస్ నేత, దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్‌ను అరెస్టు చేయడంపై ఆ పార్టీ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, బొల్లి రామ్మోహన్, పడిగెల రాజు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మోతె మహేశ్, గుండు ప్రేమ్ కుమార్, అమర్‌రావు, బండి జగన్, తాజొద్దీన్, నవీన్ రావు, శ్రీకాంత్ రెడ్డి, పూర్ణ, ఆఫ్రొజ్, జీవన్, చక్రపాణి, అంజితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు.