Raindrops | తిమ్మాపూర్, మే21: వర్షాకాలం ముందే ప్రారంభమైంది. మరో వారం రోజులు మోస్తారు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ చెబుతోంది. దీంతో ఆలస్యంగా వరి పంటను కోసిన రైతులు వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి తూకం వేసేందుకు వేచి చూస్తున్నారు. వర్షం వల్ల వడ్లు తేమ శాతం ఎక్కువగా వస్తుండడంతో కొనుగోళ్లు చేయడం లేదు. మరిన్ని రోజులు వర్షాలు పడితే వడ్లెట్ల అమ్ముకునుడు అని రైతులు ఆందోళన చెందుతున్నారు. మానకొండూర్ డివిజన్ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి.
అయితే ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు కోతలు ఇటీవలే పూర్తయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో పదుల ఎకరాల్లో కోయాల్సి ఉంది. అయితే కోతలు పూర్తయిన రైతులు అమ్ముకునేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసి ఉంచారు. వడ్లు పోసిన నాటి నుండి వారం రోజులుగా ఎడతెరపి లేకుండా రోజూ వర్షం పడుతున్న నేపథ్యంలో రైతులు వడ్లు ఎలా అమ్ముకోవాలో అర్థం కాక ఇబ్బందిపడుతున్నారు. అయితే వర్షాలు ముందస్తుగా పడుతుండడంతో వడ్లను ఆరబెట్టుకునే అవకాశం రైతులకు ఉండడం లేదు.
దీంతో ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోతున్నాయి. కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని రోజూ సంరక్షించుకునే పనిలో ఉండిపోతున్నారు. పరదాలు కప్పినా కూడా ఒక్కోచోట తడుస్తూనే ఉన్నాయి. పరదాల చుట్టూ నీళ్లు చేరి కుప్పల కిందికి నీళ్లు వెళ్తున్నాయి. పక్కకు తీసి పోద్దామన్నా పక్కన కూడా నీళ్లు, తడి ఉండడంతో పోయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తేమ రాకున్నా.. కొనాలంటున్న రైతులు
ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం తేమ శాతం కావాల్సినంత రాకున్నా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని, పూర్తిగా తడవని ధాన్యాన్నైనా కొనుగోలు చేసేలా రైస్ మిల్లర్లకు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇలానే వదిలేస్తే పాడైపోయి పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని తడవకుండా ఎంతకాపాడుకున్నా ఎంతో కొంత తడుస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేస్తే రైతులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది.