కరీంనగర్ కలెక్టరేట్, మే 10: కరీంనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో కరీంనగర్-మంచిర్యాల రహదారిపై నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులు ‘ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కు’ అన్న చందంగా సాగుతున్నాయి. గడువు ముగిసినా, ఇప్పటివరకు 50 శాతం కూడా చేయకపోవడంపై సమీప ప్రాంతాల ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు.
ఓవైపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్, మరోవైపు దుమ్ము, దూళితో సతమతమవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్వోబీ నిర్మాణం కోసం రైల్వే శాఖకు పలుసార్లు లిఖిత పూర్వకంగా విన్నవించగా, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలంటూ తిరకాసు పెట్టింది. అందుకు సమ్మతించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికప్పుడు తన వంతు వాటాకూడా విడుదల చేసింది.
154కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు 2023 జూలై 13న అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 21 మీటర్ల వెడల్పు, 750 మీటర్ల పొడవుతో నాలుగు వరుసల్లో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించి, పనులు కూడా చకచకా చేపట్టారు. ఎనిమిది నెలల పాటు శరవేగంగా సాగగా, ప్రభుత్వం మారిన తర్వాత రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి.