ముంబై: ముంబైలోని సిద్ధి వినాయక గుడి నుంచి ఏటా రూ.18 కోట్ల విరాళాల చోరీ జరుగుతున్నదని మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. ఆయోధ్య రామ మందిరంలోనూ రూ.1400 కోట్ల విరాళాలను దొంగిలించారని..ఈ నేరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దేవాలయాలు కూడా అవినీతికి అతీతం కావని వ్యాఖ్యానించారు. సిద్ధి వినాయక ఆలయంలో ఉద్యోగుల చోరీ ఉదంతం ట్రస్టీల తనిఖీల్లో బయటపడిందన్నారు.
దీని తర్వాత ఆలయానికి వచ్చే వారంవారీ విరాళాలు రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్లకు పెరిగాయన్నారు. దీనిపై ఆలయ ట్రస్ట్ చైర్మన్ సదా సర్వంకర్ స్పందిస్తూ విరాళాల చోరీ ఘటనలో తొమ్మిది మంది ఉద్యోగులు అరెస్ట్ అయ్యారని చెప్పారు. అయితే ట్రస్ట్ తీసుకొన్న చర్యల వల్లే విరాళాల మొత్తం పెరిగిందని వెల్లడించారు. ఆలయ ఆదాయం ప్రస్తుతం రూ.182 కోట్లకు పెరిగిందన్నారు.