Railway Department | ఓదెల, జూలై 6 : రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ( రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లను నిర్మించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులకు గేట్లు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గేట్ల వద్ద 30 నుంచి 40 నిమిషాలు వేచి ఉండడంతో ప్రాణాలు సైతం పోతున్నట్టు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైల్వే శాఖ కాజీపేట-బల్లార్షా సెక్షన్లో రైళ్ల రద్దీ కారణంగా మూడో లైన్ నిర్మాణం చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలు గతంలో కంటే రెట్టింపు అయ్యాయి. ఈ కారణంగా రైల్వే గేట్ల వద్ద 30-40 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అయితే రైల్వే గేట్ల స్థానంలో కొన్నిచోట్ల అండర్ బ్రిడ్జీలు, మరికొన్నిచోట్ల ఆర్వోబీలను నిర్మాణం చేయడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకు సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం జరుగుతుండడం వల్ల పనులు ముందుకు సాగక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ఆర్వోబీ నిర్మాణం కోసం సర్వేలు జరుగుతున్నాయి తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంత రైల్వే గేట్ల వద్ద కూడా వాహనాలు దాదాపు అర కిలోమీటర్ మేర బారులు తీరి ఉంటున్నాయి.
మూడు, నాలుగు రైళ్లు అప్ అండ్ డౌన్ వెళితే గాని గేటు తీయడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రైల్వే శాఖ వెంటనే ఆర్వోబీలను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ఆర్వోబీల నిర్మాణం కోసం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.