గతేడాది కేంద్ర మధ్యంతర బడ్జెట్.. వేతనజీవులతోపాటు వివిధ వర్గాలకు నిరాశే మిగిల్చగా.. నేటి పూర్తిస్థాయి బడ్జెట్‌పై అందరిచూపూ నెలకొన్నది. ఆదాయపు పన్నుపై పదేళ్లుగా వివక్ష కొనసాగుతుండగా, ఇప్పుడైనా కేంద్రం కనికరం చూపుతుందా..? లేదా..? అన్న ఉత్కంఠ కనిపిస్తున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈసారైనా ఉమ్మడి జిల్లాలోని రైల్వేలైన్లు, ఆర్వోబీలు, కొత్త రైళ్లు వంటివి పట్టాలెక్కిస్తారా..? లేదా..? అన్నదానిపై చర్చ జోరుగా సాగుతున్నది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్- కాజీపేట (హసన్‌పర్తి) రైల్వైలైన్కు సంబంధించి గత బడ్జెట్లో ఊసే లేకపోగా.. అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్‌కు నిధులు ఇచ్చినా.. రాష్ట్ర వాటా సరైన పద్ధతిలో రాక భూసేకరణకు ఆటంకం ఏర్పడింది. అలాగే, మణుగూరు- రామగుండం- కోల్‌కారిడార్ లైన్‌కు పోయిన పద్దులో 5 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నది. త్వరలోనే వందే భారత్రైలు సేవలు అందుతాయని బండి గతేడాది చెప్పినా.. ఆ ముచ్చటే లేకుండా పోయింది. మరికొద్ది గంటల్లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఈసారైనా ఉమ్మడి జిల్లాకు న్యాయం జరుగుతుందా..? లేదా..? అన్న చర్చ నడుస్తున్నది.
Budget 2025 | కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐటీ మినహాయింపుపై కేంద్రం పదేళ్లుగా వివక్ష చూపుతూనే ఉన్నది. గతేడాది పూర్తిగా నిరాశ పరిచింది. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీజేపీ చాలానే చెప్పింది. తాము అధికారంలోకి వస్తే పన్ను స్లాబులను హేతుబద్ధీకరిస్తామని, పన్ను రేట్లను తగ్గిస్తామంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు, గడిచిన పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల్లో కొత్తగా వెసులుబాటు కల్పించలేదు. అలాగే, పన్ను రేట్లను సైతం తగ్గించలేదు. ఆకర్శణీయంగా లేని కొత్త పన్నుల విధానాన్ని అమల్లోకి తెచ్చి అయోమయం మాత్రం సృష్టించింది. కనీసం 80సీ, 80డీ ఇంటి అద్దె, విద్య, గృహరుణాలపై వడ్డీ, తదితర మినహాయింపులు వర్తింపజేయాలని ఏళ్లుగా సంఘాలు కోరుతున్నా.. ఆ విషయాన్ని సైతం పట్టించుకోలేదు. ప్రత్యక్ష పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షలకు పెంచాలని పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. పెడచెవిన పెడుతూ వస్తున్నది.
నిజానికి ఆదాయ పరిమితిని 2.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచి తీరాలని నాటి యూపీఏ ప్రభుత్వాన్ని ఆనాటి బీజేపీ నాయకులు పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఆనాడు బీజేపీ నేత అరుణ్‌జైట్లీ కూడా ఈ విషయంపై యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నాయకులు మరుగున పడేశారు. పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వం, వేతనజీవులపై మాత్రం కనికరం చూపలేదు. కేంద్రం పన్ను పరిమితి పెంపును నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నది. ఈ పదేళ్ల కాలంలో కొత్తగా ఒక స్లాబ్‌ను తీసుకొచ్చిందే తప్ప పరిమితి మాత్రం పెంచడం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న పాత స్లాబ్‌ను అమలు చేస్తూనే మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త స్లాబ్‌ను కలిపి, రెండు రకాల స్లాబ్‌లను ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్నది. అంతే తప్ప ఆదాయపు పన్ను, స్టాడెండ్ డిడెక్షన్, అలాగే పొదుపు మినహాయింపుల పరిమితులు మాత్రం పెంచడం లేదు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న స్లాబ్ ప్రకారం చూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20శాతం, 10 లక్షలపైగా ఆదాయముంటే 30 శాతం టాక్సు చెల్లించాలి. అలాగే, బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన స్లాబ్ ప్రకారం చూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం, 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10 శాతం, 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం, 15 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం, 15 లక్షలకు పైబడి ఆదాయముంటే 30 శాతం టాక్సు చెల్లించాలి. అయితే, బీజేపీ అమల్లోకి తెచ్చిన రెండో స్లాబ్‌ను మెజార్టీ వేతన ఉద్యోగులు పక్కన పెట్టారు. ఈ స్లాబ్‌ను ఎంచుకుంటే పొదుపు పరిమితి అంటే 1.50 లక్షల మినహాయింపులు వర్తించవు. గృహరుణాలపై ఇంట్రెస్ట్ మినహాయింపులు వర్తించవు. అందుకే ఉద్యోగులంతా మొదటి స్లాబ్‌నే ఆధారంగా చేసుకొని పన్ను చెల్లిస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపులు భారీగా ఉండే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కనికరం చూపుతుందా..? లేక గతంలో మాదిరిగానే ఊరించి ఉసూరు మనిపిస్తుందా..? చూడాలి!
ఉమ్మడి జిల్లాలోని వివిధ రంగాలకు కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఈసారైనా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి విజయం సాధిస్తారా..? లేదా..? అన్న చర్చ సాగుతున్నది. ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి కొత్తపల్లి- మనోహరాబాద్‌కు వీలైనన్ని ఎక్కువ నిధులు తెస్తేగాని, సంపూర్ణంగా భూసేకరణ పూర్తయ్యేలా కనిపించడం లేదు. నిధులు అధికంగా వచ్చి రెండువైపుల నుంచి పనులు చేస్తే.. లైన్ త్వరితగతిన ఉమ్మడి జిల్లావాసులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరంగా చూస్తే.. అత్యంత ఆదాయాన్నిస్తున్న కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించాల్సిన అవసరం చాలా ఉన్నది. అలాగే, వందేభారత్ రైలు నడపాలన్న డిమాండ్ ఉన్నది. అత్యంత ప్రధానమైన కరీంనగర్- కాజీపేట (హసన్‌పర్తి) వయా హుజూరాబాద్ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ గతంలో కేంద్రాన్ని ఒప్పించిన విషయం తెలిసిందే. ఆ మేరకు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసేందుకు రైల్వే బోర్డును కూడా ఆయన ఒప్పించగా, సర్వే పూర్తయింది. నిజానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించినంత వరకు ఇది అత్యంత ప్రాధాన్యత లైన్! కాజీపేట జంక్షన్‌తో ఒకసారి లింక్ ఏర్పడితే ఉమ్మడి జిల్లావాసులు దేశంలో ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యం కలుగుతుంది. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కేంద్రాన్ని ఒప్పించినా.. దానిని కంటిన్యూ చేసి.. నిధులు కేటాయింపు చేసుకోవడంలో బండి సంజయ్ ఇప్పటివరకు విఫలమవుతూనే ఉన్నారు. ఈ లైన్‌కు సంబంధించి తాజా బడ్జెట్లో నిధులు వచ్చేలా బండి చర్యలు తీసుకుంటారా..? లేదా..? అన్నది మరో కొద్ది గంటల్లో తేలనున్నది.
సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే బడ్జెట్ కేటాయింపులోనూ ప్రతిసారి కేంద్ర సర్కారు ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తూనే ఉన్నది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్-కాజీపేట (హసన్‌పర్తి) రైల్వేలైన్‌కు సంబంధించి గత బడ్జెట్లో ఊసే ఎత్తలేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్‌కు నిధులు ఇచ్చినా.. రాష్ట్ర వాటా వంటి విషయాలతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. మరో ప్రతిష్టాత్మకమైన మణుగూరు- రామగుండం- కోల్‌కారిడార్ లైన్‌కు కేవలం గత బడ్జెట్లో 5 కోట్లు మాత్రమే కేటాయించింది. వందేభారత్ రైలు ముచ్చటే లేదు. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ఆదాయాన్నిస్తున్న కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, సౌకర్యాల మెరుగు కోసం డబ్బులు కేటాయించలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చూస్తే రైల్వే రంగంపై కేంద్రం పూర్తి వివక్ష చూపుతూ వస్తున్నది.
ఈసారి బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందా..? లేదా..? అన్న చర్చ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నది. పాతికేళ్ల క్రితం పురుడు పోసుకున్న రామగుండం- మణుగూరు- కోల్‌కారిడార్ రైలు మార్గానికి 2013లో 1,112 కోట్ల అంచనాతో ప్రతిపాదించగా గత అక్టోబర్‌లో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ లైన్‌కు ఈసారైనా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తే తప్ప పురోగతి కనిపించదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కొద్దినెలల కిందట దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ నిర్వహించిన ఎంపీల సమావేశంలో ఉమ్మడి జిల్లా సభ్యులు పలు ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా పెద్దపల్లిలో ఏపీ సంపర్క్ క్రాంతి, స్వర్ణజయంతి, వైన్ గంగా, కాశీ- తమిళసంఘం, గోవా, జీటీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లకు.. రామగుండంలో చెన్నై- నిజామొద్దీన్ గరీబ్థ్,్ర తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లకు.. జమ్మికుంటలో తెలంగాణ, జీటీ హాల్టింగ్ కల్పించడంతోపాటు పెద్దపల్లి, జమ్మికుంటల్లో దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలని ప్రతిపాదించారు.
అలాగే, రైల్వే బోర్డు అనుమతించిన విశాఖ-షిర్డీ మధ్య నడిచే సాయినగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా మళ్లించాలని, కరీంనగర్- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను బాసర వరకు పొడిగించడంతోపాటు కరీంనగర్ మీదుగా నడిచే దాదర్ ప్రత్యేక రైలును క్రమద్ధీకరించాల్సి ఉన్నది. పెద్దపల్లి- విజయవాడ పుష్‌పుల్‌ను పునరుద్ధరించాల్సి ఉన్నది. కరీంనగర్- సికింద్రాబాద్, కరీంనగర్- విజయవాడ మధ్య పెద్దపల్లి మీదుగా వందే మెట్రో (నమోభారత్ ర్యాపిడ్) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలన్న డిమాండ్ వస్తున్నది. దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ నడుస్తున్నది.
వందేభారత్ రైలు సేవలు ఉమ్మడి జిల్లా వాసులకు త్వరలోనే అందుతాయని గతేడాది బండి సంజయ్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందేభారత్‌కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేసినట్టు రైల్వే అధికారులు గతంలోనే ప్రకటించారు. పెద్దపల్లి-కరీంనగర్ మధ్య 100 కిలోమీటర్ల స్పీడ్, కరీంనగర్- జగిత్యాల (లింగంపేట) మధ్య 90 కి.మీ, జగిత్యాల- నిజామాబాద్ 100 కిలోమీటర్లు, మేడ్చల్ -మనోహరాబాద్ 110 కిలోమీటర్లు స్పీడ్‌తో నడిపేలా రైల్వేలైన్లను ఆధునీకరించినట్టు ప్రకటించారు. కానీ, గత బడ్జెట్లో చూస్తే అందుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలను కేంద్రం ప్రకటించలేదు.