మల్యాల, ఏప్రిల్ 22 : కరీంనగర్ ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. 2019లో చేసిన పొరపాటును మళ్లీ చేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా నిధులు తీసుకొస్తానని హామీనిచ్చారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ప్రజలు గోస పడుతున్నారని, బీజేపీకి ఓటేస్తే ఆగమవుతారని హెచ్చరించారు. మార్పంటే 2203 రూపాయలు పలికే ధాన్యాన్ని రైతులు 1800 రూపాయలకు మిల్లర్లకు అమ్ముకునేలా చేయడమేనా..? చొప్పదండి నియోజకవర్గంలో జీవనదిలా ఉన్న వరదకాలువను ఎండబెట్టడమేనా..? అని ఎద్దేవా చేశారు. అసలు మార్పంటే అభివృద్ధిలో పోటీ పడాలని, కేంద్రంతో కొట్లాడి యువతకు సింగపూర్ తరహాలో శిక్షణనిచ్చే వృత్తి నైపుణ్య కేంద్రాలను నెలకొల్పాలని, హైదరాబాద్ నుంచి కరీంనగర్ రైలు మర్గాన్ని పూర్తి చేయాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాలలో సోమవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం మతాల పేరిట యువతను రెచ్చగొట్టడం తప్పితే కనీసం ఐదు రూపాయల పని చేయలేదని విమర్శించారు.
ఉపాధిహామీ కింద చేపట్టిన పనులను పల్లెల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయించానంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉంటే పదేళ్ల బీజేపీ పాలనలో ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా రాలేదని విమర్శించారు. నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురాలేదని ఓట్లకోసం వచ్చే సంజయ్‌ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎంపీ పదవి ఏమైనా బండి కోసం తీసుకువచ్చారా..? ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ పునరావాసమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల కరీంనగర్‌కు ఒరిగేదేమీ లేదన్నారు. మార్పు పేరిట ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, కానీ, ఆ పార్టీ మార్పు పేరిట ప్రజలను వంచించిందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడానికేనా..? అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి విధానం వల్ల ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కరీంగనర్ ఎంపీ అభ్యర్థిని తేల్చుకోలేకపోతున్నదని విమర్శించారు. ఎంపీ అంటే కేంద్రంతో కొ ట్లాడి తెలంగాణ నిధులు తేవాలని, ఇందంతా జరగాలంటే తెలంగాణపై అవగాహన ఉన్న నాయకుడు ఉండాలని చెప్పారు. ఉద్యమ సమయంలో తనకు తెలంగాణ అంతటా తిరిగిన అనుభవం ఉన్నదని, ప్రజాసమస్యలపై అవగాహన ఉన్నదని చెప్పారు. తనను కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటానని, అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తాను హిందువుని కాకపోతే కొండగట్టు ఆలయానికి ప్రభుత్వ భూమిని 333 ఎకరాలు ఎలా బదిలీ చేయిస్తానని చెప్పారు. ఈ విషయంలో కొంతమంది బీజేపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ కాగితాలే భూములను బదిలీ చేసిన విషయానికి రుజువులని స్పష్టం చేశారు. కావాలంటే వారికి సైతం కాగితాలు పంపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి, డాక్టర్ అమిత్‌కుమార్, మండ ల పార్టీ అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కొండపలుకుల రాంమోహన్‌రావు, సుభాన్, ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్‌రావు, బోయినిపల్లి మధుసుదన్‌రావు, నేల్ల రాజేశ్వర్‌రెడ్డి, తైదల శ్రీలతరెడ్డి, తిరుపతిరెడ్డి, సంపత్, అజహర్, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత హక్కుల గురించి పార్లమెంట్లో గళమెaత్తి ప్రశ్నించే గొంతుక కావాలి. కరీంగనర్ అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు వినోద్‌కుమార్. ఎమ్మెల్యేగా నేను రాష్ట్రంలో, ఎంపీగా వినోద్ గెలిస్తే పార్లమెంట్లో పోరాడి నిధులు తెస్తం. మేమంతా ఐక్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా అడుగులు వేస్తం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టింది. నాలుగు నెలల్లోనే కరువు తెచ్చింది. సాగునీరు, తాగునీరు లేక గోసపడుతున్నాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలి.