peddapally | పెద్దపల్లి రూరల్ మే 03 : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనుగోలు చేసి మద్దతు ధర లభించేలా చూసేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. మండలంలోని అప్పన్నపేట సింగిల్ విండో పరిధిలో గల మండలంలోని అప్పన్నపేట, అందుగులపల్లి, కుర్మపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కోయశ్రీహర్ష సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలన్నారు. రెగ్యులర్ గా ధాన్యం తేమ శాతం పరిశీలించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లుల వద్ద ధాన్యం తరలింపు కోసం అవసరమైన వాహనాలు, హామాలీలను అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం కురిస్తే టార్ఫాలిన్లు కవర్లతో ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.
రైస్ మిల్లులకు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే సరఫరా చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో పెట్టుకొవాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కలెక్టర్ వెంట పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి, అప్పన్నపేట సింగిల్ విండో సీఈఓ గడ్డి తిరుపతి, శివప్రసాద్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.