ముత్తారం, జూన్ 06: రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో గత బీఆర్ఎస్ సర్కార్లో ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాంసాని సమ్మయ్య అనే రైతు సాగు చేసిన ఆయిల్ పామ్ తొలి పంట దిగుబడిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలోచన చేశారని ఆయన గుర్తు చేశారు. మొట్టమొదటగా 24గంటల విద్యుత్, రెండో విడతగా నీళ్లు ఇచ్చిన కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెట్టుబడి సాయం అందించారని ఆయన తెలిపారు. ఒకే పంటకు పరిమితమైన రైతులు సరైన దిగుబడి రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పంట సాగు విధానంలో మార్పు వస్తే బాగుంటుందనే గొప్పగా ఆలోచన చేశారన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో మొదటిసారి ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అందించారని ఆయన గుర్తు చేశారు. జిల్లాలోని ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్కు చెందిన నాంసాని సమ్మయ్య ముందుకు వచ్చి ఆయిల్ పామ్ పంట సాగు చేశారని, మూడేళ్ల తర్వాత పంట చేతికి వచ్చిందన్నారు. ఈ పంట 35 ఏండ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో…ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసిండో అర్థం అవుతుందన్నారు. అయితే ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రైతులు మళ్లీ ఆకాశం వైపు చూసే పరిస్థితులు నెలకొన్నాయని, కరెంటు నీళ్లు అందడం లేదని, కనీసం పెట్టుబడి సాయం కూడా ఇవ్వకపోవడం అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందని, కనీసం పంట కొనేవాళ్లు కరువయ్యారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రతి ఆలోచన రైతులకు మేలు చేశారని, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాయని స్పష్టం చేశారు.