ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ అలసత్వమే కనిపిస్తున్నది. ఓవైపు కోతలు ముమ్మరం అవుతున్నా.. కొనడంలో మాత్రం జాప్యమే జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రుల, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేంద్రాలను ప్రారంభిస్తున్నా.. కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. కరీంనగర్ జిల్లాలో 328 కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ఇప్పటి వరకు కేవలం ఏడు కేంద్రాల ద్వారా 148 మెట్రిక్ టన్నులే కొనడం పరిస్థితికి అద్దం పడుతున్నది. అనేక కేంద్రాల్లో టార్పాలిన్లు సమకూర్చడం లేదని, అకాల వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభించిన ప్రతి కేంద్రంలో తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాల్లో 60 నుంచి 70 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. ఇంకొన్ని మం డలాల్లో 80 నుంచి 90 శాతానికి చేరుకున్నాయి. చివరలో వేసిన ప్రాంతాల్లో చూస్తే 20 నుంచి 30 శాతం కోతలు కంప్లీట్ అయ్యాయి. అంటే ప్రతి మండలంలో ముమ్మరమయ్యాయి. అయితే కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 328 కొనుగోలు కేంద్రాలను ఈ నెల 10వ తేదీనే ప్రారంభిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కానీ, ఇప్పటికీ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఒక్కొక్కటి ప్రాంభిస్తున్నారు. కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభిస్తున్నా.. కొనుగోళ్లు మాత్రం జరపడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని కేవలం 148 మెట్రిక్ టన్నుల ధాన్యం నిన్న ఒక్క రోజే కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. నిజానికి కోతల వెంటే కొనుగోళ్లు ప్రారంభించినట్లయితే ఇప్పటికే అనేక మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకునే పరిస్థితి ఉండేది.
కరీంనగర్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 185, ఐకేపీ ద్వారా 101, డీసీఎమ్మెస్ ద్వారా 38, హాకా ద్వారా 4 చొప్పున మొత్తం 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 148 టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి ధాన్యం అక్కడే కనిపిస్తున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా రైతులు పడిగాపులు పడాల్సి వస్తున్నది. అకాల వర్షం భయపెడుతున్నది. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టార్పాలిన్ల కొరత తీవ్రంగా ఉన్నది. వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో వల్లంపహాడ్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, కిసాన్‌నగర్‌కు చెందిన రైతులు మూడు నాలుగు రోజులుగా ధాన్యం తెచ్చి కుప్పలుగా పోస్తున్నా. ఇప్పటికే 10 మందికిపైగా ధాన్యం తెచ్చారు. రాత్రీ పగలు పడిగాపులు కాస్తున్నారు. టార్పాలిన్ల కొరత ఉన్నది. అధికారులు మాత్రం ఇప్పటి వరకు కేంద్రాన్ని ప్రారంభించలేదు. కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి, బద్దిపల్లి, మల్కాపూర్, ఆసిఫ్‌నగర్, చింతకుంట గ్రామాల్లో కోతలు ముమ్మరమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారం మల్కాపూర్‌లో 500 క్వింటాళ్లు తీసుకోవడం మినహాయిస్తే ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదు. కరీంనగర్ రూరల్ మండలంలోని మిగతా గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కేంద్రాలను ప్రారంభించారు. అదే విధంగా కొనుగోళ్లు కూడా ముమ్మరం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
మానకొండూర్ మార్కెట్ యార్డులో శుక్రవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికే రైతులు ఇక్కడ ధాన్యం కుప్పలు పోసుకుని ఉన్నారు. కేంద్రం ప్రారంభించిన అధికారులు ఒక్క క్వింటాల్ ధాన్యం కూడా కొనలేదు. తేమ శాతం అధికంగా ఉందని, ఆరబెట్టిన తర్వాత కొంటామని చెప్పడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఇదే మండలంలోని మరిన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే కేంద్రాలను ప్రారంభించారు. కానీ ఒక్క చోట కూడా కొనుగోళ్లు చేయలేదు. పలు గ్రామాల్లో పంట కోతలు చేసిన రైతులు కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు. శంకరపట్నంలో వారం పదిరోజులుగా కోతలు ముమ్మరంగా జరుగుతుండగా, రైతులు రోడ్లపై, కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసుకుని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి కేంద్రాలను ప్రారంభించారు.
హుజూరాబాద్ మండలంలో ఎక్కువగా ఈ సీజన్లో సీడ్ వడ్లు సాగు చేస్తారు. ఈ మండలంతోపాటు వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో సీడ్ వడ్లు కోతలు దాదాపుగా ముగిశాయి. సాధారణ కోతలు ముమ్మరంగా నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. వీణవంకలో 70 నుంచి 80 శాతం కోతలు పూర్తయ్యాయి. వీణవంక, చల్లూరు, మామిడాలపల్లి, కనపర్తి గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ, కొనుగోళ్లు మాత్రం ప్రారంభించ లేదు. ఈ మండలంలోనూ టార్పాలిన్ల కొరత తీవ్రంగా కనిపిస్తున్నది. అకాల వర్షం పడితే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో నిన్నటి నుంచే కేంద్రం ప్రారంభించగా ఇప్పటి వరకు కొనుగోళ్లు మాత్రం చేపట్టలేదు.
చిగురుమామిడి మండలంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించారు. సైదాపూర్ మండలంలో జాగిరిపల్లె మినహాయిస్తే మిగతా గ్రామాల్లో స్వల్పంగా కొనుగోళ్లు చేశారు. వెన్నంపల్లిలో ఇంకా కొనుగోలు కేంద్రాన్నే ప్రారంభించ లేదు.
చొప్పదండి మండలంలో కోతలు ముమ్మరంగా నడుస్తున్నాయి. కానీ, కొనుగోళ్లు మాత్రం ప్రారంభించలేదు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌తోపాటు రుక్మాపూర్, కొలిమికుంట, భూపాలపట్నంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనుగోళ్లను ప్రారంభించారు. కానీ, కొనుగోళ్లు మాత్రం జరగ లేదు. గంగాధర మండలంలో 70 శాతానికిపైగా కోతలు జరిగాయి. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికే పలు గ్రామాల రైతులు పచ్చి ధాన్యాన్నే తక్కువ ధరకు దళారులకు విక్రయించుకున్నారు. పది పదిహేను రోజులుగా ధాన్యం ఆరబోస్తూ రైతులు పడిగాపులు పడుతున్నారు. కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రామడుగు మండలంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దత్తోజిపేటలో కేంద్రం ప్రారంభించినా కొనుగోళ్లు మొదలు కాలేదు.
కోతలు ప్రారంభమై 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ముమ్మరం చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల వద్ద ఆరబెట్టుకునే సదుపాయం లేక కేంద్రాల్లో, మార్కెట్ యార్డులను ఆశ్రయిస్తున్నారు. కొందరు రైతులు పది పదిహేను రోజులుగా ధాన్యం ఆరబెట్టుకోవడం, కుప్పలు చేయడం వంటి పనులకే పరిమితం అవుతున్నారు. చాలా చోట్ల టార్పాలిన్లకు కొరత కనిపిస్తుండగా, వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల తేమ అధికంగా ఉందని మిల్లర్లు వంకలు పెడుతుండగా, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కోతలు ముగిసిన తర్వాత ఒకటి రెండు రోజులు ఆరబెడితే సరిపోతుందని, నిబంధనల ప్రకారం 18 శాతం తేమ ఉండే కొనుగోళ్లు చేయాలని అంటున్నారు. కానీ, ఎక్కువ రోజులు ఆరబెడితే తేమ మరింత తగ్గి తూకంరాక తాము నష్టపోయే ప్రమాదముంటుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరిగితే అకాల వర్షాలతో ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పది రోజులుగా కోతలు ముమ్మరమయ్యాయి. ముందు వరి సాగు చేసిన కొన్ని ప్రాంతాల్లో దాదాపు 20 రోజుల నుంచే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లు, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. కోతల వెంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుంటే రెండు మూడు రోజులు ఆరబెట్టుకుని తేమ శాతం వచ్చిన తర్వాత రైతులు విక్రయించుకునే అవకాశముండేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ముందుగా కోతలు నిర్వహించుకున్న రైతులు ఇప్పటికీ ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి ఉన్నది.
మాది కరీంనగర్‌లోని సీతారాంపూర్. ఇక్కడి మార్కెట్ల కేంద్రం ఓపెన్ చేసిన్రని వడ్లు తెచ్చిన. తీరా ఇక్కడికచ్చి చూస్తే ఇంకా కొంట లేరని తెలిసింది. నాకున్న 25 గంటల భూమిల ట్రాక్టర్ వడ్లు వచ్చినయి. నిన్నటి నుంచి ఆరబెడుతున్న. మంచిగ ఎండినయి. రేపటెల్లుండి కాంట పెట్టకుంటే తేమ తగ్గి తూకం వేస్తే ఎక్కువ వడ్లు పోవచ్చు. నాకు నష్టం రావచ్చు. ఇప్పటికైనా అధికారులు తొందరగా కొనుగోళ్లు జరిపితే నాకు ఎలాంటి నష్టం ఉండదు.
మాది వల్లంపహాడ్. నాలుగు ట్రాక్టర్ల వడ్లు తెచ్చిన. సొసైటీ ఆధ్వర్యంల ఇక్కడ వడ్లు కొంటరు. ఇప్పటికే కేంద్రం ప్రారంభించేది ఉండే. ఇప్పటి వరకు ప్రారంభించలే. కనీసం టార్పాలిన్లు సుత ఇస్త లేరు. వానస్తే మా సంగతి అంతే. నిన్నటి నుంచి ఆరబెడుతున్నం. వానచ్చేతట్టున్నది. వెంటనే కొంటే ఫర్వాలేదు. నాలుగైదు రోజులు ఆగితే మాత్రం మా పని ఖతమే. వర్షానికి తడిస్తే వడ్లు కొనమంటరు. తెచ్చి రెండు రోజులైతంది. ఇప్పటికే కొంటే బాగుండు. పొద్దుగాల ఆరబెడుతున్నం. సాయంత్రం కుప్ప జేస్తున్నం. కానీ వర్షాం వస్తదనే భయమే ఉంది.
– ఒడ్నాల దేవేందర్, వల్లంపహాడ్