CP Sai Chaitanya | వినాయక్ నగర్, ఆగస్టు 4 : ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారి పై భారీగా వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో టౌన్-6 ఎస్ఐ కే సందీప్ ఆదేశాలతో ఏఎస్ఐ జక్రయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా హుటాహుటిన స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియత్రించినట్లుగా సీపీ పేర్కొన్నారు. భారీ వర్షం నీరు కారణంగా డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వరద నీటి ప్రవాహం రోడ్డుపై నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడగా దాన్ని గమనించిన పోలీస్ సిబ్బంది , సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి జేసీబీల సహాయంతో ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేయించినట్లు చెప్పారు. దీంతో రహదారిపై రాకపోకలు మళ్లీ ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత అంకితభావంతో విధులు నిర్వహించిన 6 టౌన్ పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శాలువాలతో ప్రత్యేకంగా సత్కరించి, అభినందిస్తూ ప్రశంసించారు. ఇదే సేవాస్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , ఆరవ టౌన్ ఎస్సై సందీప్ తదితరులు పాల్గొన్నారు.