రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం, యంత్రాంగం, నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి దుందుడుకు చర్యలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాసంలో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలంటూ ఆ పార్టీ శ్రేణులు చేసిన రచ్చపై బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు ప్రొటోకాల్ పాటించకపోయినా సహిస్తున్నామని, కానీ, గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరిస్తున్నాయి.
కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుకలపై కాంగ్రెస్ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. ఏడాది కాలంగా ప్రెస్మీట్లు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెనకబడ్డ సిరిసిల్లను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అవమానపరిచేలా అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీల్లో ఫొటో పెట్టకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారు. అక్కడితో ఆగకుండా రెచ్చగొట్టే మాటలు, ప్రసంగాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
కార్మిక ధార్మిక క్షేత్రం నిరుద్యోగులకు పదివేల మందికి ఉపాధి కల్పించేలా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 165 కోట్లతో ఏర్పాటుచేసిన అప్పారెల్ పార్కులో అంతర్జాతీయ గార్మెంట్ పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్ కృషి చేశారు. ఆయన కృషితో ఏర్పాటైన టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ కంపెనీని గత నెల 12న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. 2వేల మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఫొటోలు కూడా ఫ్లెక్సీలో పెట్టకపోవడం ప్రభుత్వ వివక్షతకు కారణమన్న విమర్శలు వచ్చాయి. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ల అధికారిక కార్యక్రమంలో సైతం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటోను ఫ్లెక్సీలో పెట్టకుండా అక్కసు చూపారు.
కేటీఆర్ ఫొటోను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడులు చేసే ందుకు యత్నించారు. ఘర్షణకు తావిస్తున్న కాంగ్రెస్ నేతల తీరుపై, వారికి సహకరిస్తున్న కొంత మంది అధికారుల శైలిపై ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఇవి చాలవన్నట్టు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను కార్యాలయంలో పెట్టాలంటూ పోలీసుల ముందే బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డ తీరు.. హస్తం నాయకుల ఆగడాలు ఏ మేరకు శృతిమించుతున్నాయో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం, అధికారయంత్రాగం వత్తాసు పలుకుతున్నదని చెప్పడానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.