హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో వివిధ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.116 కోట్లు, వికారాబాద్ జిల్లాలో వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లను ప్ర భుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఖమ్మం జిల్లాలో కలకోట నుంచి రేపల్లె, గన్నవరం, మసులమడుగు మీదుగా లక్ష్మీపురం వరకు ఉన్న రహదారిని విస్తరించడానికి రూ. 57కోట్లు మంజూరు చేశారు. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ప్లాన్ కింద పనులు చేపడుతామన్నారు.
‘వీబీజీ-రామ్‌జీ’తో కూలీలకు నష్టం ; రాష్ట్ర ఉపాధి హామీ మండలి సభ్యులు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ-రామ్జీతో ఉపాధి కూలీల కు నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని ఉపాధిహామీ మండలి సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక అధ్యక్షతన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం 9వ రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశాన్ని నిర్వహించారు. కూలీలకు ఉపాధి హకుగా లభించే ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉపాధిహామీ చట్టం అమలు, కల్పించిన పనిదినాలు, చేపట్టిన పనులు, సృష్టించిన సామాజిక ఆస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్షించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ దివ్యా దేవరాజన్, మండలి సభ్యులు సొమయ్య, భగవాన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, నరసింహులు గౌడ్, రమేశ్ పాల్గొన్నారు.