ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు భగ్గుమంటున్నారు. 40 కిలోల బస్తాకు 42కు బదులు 43 కిలోల తూకం వేస్తూ నిలువు దోపిడీ చేస్తుండడంపై మండిపడుతున్నారు. ఈ మేరకు గురువారం మండుటెండలోనూ ఎక్కడికక్కడ రోడ్డెక్కారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలదాటినా కొనుగోళ్లు మాత్రం చేయడం లేదని ఆగ్రహించారు. ఇంకెప్పుడు తూకం వేస్తారంటూ నిలదీశారు. తూకం వేసిన బస్తాలను వెంట వెంటనే తరలించడం లేదని, అకాల వర్షం వచ్చి తడిస్తే ఎవరిది బాధ్యత? అంటూ ప్రశ్నించారు. తమ పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన చెందారు. పనులన్నీ వదులుకొని పడిగాపులు గాస్తున్నామని, ‘ఎండకు ఎండవోసుడు.. మబ్బు వడితే కుప్ప వోసుడే మా పని అయింది’ అని వాపోయారు. హమాలీలు, లారీల కొరత లేకుండా చూసి ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. అన్నదాతను గోస పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.
నెల క్రితం తెచ్చినా కొనరా..?
ఇల్లంతకుంట, మే 14 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనడం లేదని ఇల్లంతకుంట మండల పొద్దుతిరుగుడు రైతులు ఆగ్రహించారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం ఇల్లంతకుంటలో రోడ్డెక్కారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి, బిక్కవాగు వంతెనపై ధర్నా చేశారు. ఆరుగాలం శ్రమించిన పండించిన పంటను అమ్ముకునేందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని వాపోయారు. ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు నెల క్రితం సన్ ఫ్లవర్ పంటను తెచ్చినా కొనేవారు లేరని, గత నెల 23 నుంచి ఇప్పటి వరకు తూకం వేయడం లేదని మండిపడ్డారు.
ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడారు. రైతులు పండించిన పంటలను కొనకుండా కాంగ్రెస్ సర్కారు ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. రైతులు తమ ధాన్యం కొనాలని నాలుగు రోజులుగా మండుటెండలో ధర్నాలు చేస్తున్నా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మోస పూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులను గ్రామాల్లో అడుగు పెడితే తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
అనంతరం రైతులు వివేకానంద చౌరస్తాలో వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశారని, రైతుబంధు సకాలంలో ఇచ్చారని, పంటలను కొన్నారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో రైతులకు ప్రోత్సాహం కరువైందని ఆవేదన చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మార్క్ఫెడ్ డీఎం హబీబ్ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి రెండు రోజుల వ్యవధిలో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్, ఏవో ఉన్నారు.