ధాన్యం పేరుకుపోతున్నది. కేంద్రాల్లోనే మూలుగుతున్నది. కోతలు మొదలై వారం, పదిరోజులైనా కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో కుప్పలు తెప్పలుగా పోగుపడుతుండగా, రైతాంగం ఆగమవుతున్నది. వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నది. వడ్లను కాపాడుకునేందుకు సెంటర్ల వద్దే పడిగాపులుకాస్తున్నది. ఇదే అదనుగా దళారులు రెచ్చిపోతుండగా, పలువురు రైతులు వేచిచూడలేక అగ్గువకే అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, తమ రెక్కల కష్టం నీళ్లపాలు చేయొద్దని, కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.
చొప్పదండి/ చిగురుమామిడి/ కరీంనగర్‌రూరల్, ఏప్రిల్ 15: ఉమ్మడి జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. వారం పది రోజుల నుంచి ఊపందుకున్నాయి. ఈ నెల చివరి వారంలో కోయాల్సిన రైతులు, అకాల వర్షాలు పడే అవకాశాలతో ముందుగానే ప్రారంభించారు. వచ్చిన దిగుబడులను ఐకేపీ, సింగిల్ విండోలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసే ప్రదేశాలకు తరలిస్తున్నారు. అయితే ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 10 నుంచి 15శాతం కోతలు పూర్తయ్యాయని, మరో 15 రోజుల్లో 40శాతం కంప్లీట్ అవుతాయని, ఇంకెప్పుడు మొదలుపెడతారని ప్రశ్నిస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభంకాకపోవడంతో ఇదే అదనుగా దళారులు రెచ్చిపోతున్నారు. కల్లాల వద్దే కాంటాలు పెడుతున్నారు. చాలామంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని భావిస్తుండగా, మరికొందరు వేచి చూడలేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు.
కొనుగోళ్లు మొదలుకాక రైతులు అరిగోసపడుతున్నారు. చిగురుమామిడి, చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లో కోతలు స్పీడప్ కావడంతో ఆందోళన చెందుతున్నారు. చిగురుమామిడి మండలంలో 20 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సుమారు 49 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం(సింగిల్ విండో) ద్వారా ములనూరు, రామంచ, గునుకుల పల్లె, సుందరగిరి, నవాబుపేట, బొమ్మనపల్లి, రేకొండ, సీతారాంపూర్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మహిళా సంఘాల ద్వారా (సెర్ప్- ఐకేపీ) ఆధ్వర్యంలో చిగురుమామిడి, బొమ్మనపల్లి, ఇందుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేశారు. కానీ, ఈ సీజన్లో మాత్రం ఏ ఒక్క కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. గన్నీ సంచులు, తూకం వేసే, తేమ కొలిచే, తూర్పార పట్టే యంత్రాలను సమకూర్చడం, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు తదితర పనులు చేపట్టలేదు. అయితే ఉల్లంపల్లి, నవాబ్ పేట్, సుందరగిరి, కొండాపూర్ తదితర గ్రామాల్లో 250 ఎకరాల వరకు కోతలు పూర్తికాగా, రైతులు కొనుగోళ్ల కోసం వేచిచూడలేక దళారులకు అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.
చొప్పదండి మండలంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మండలంలో ఈ సీజన్లో 17,549 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారు. ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తుండడంతో 600 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తం 50వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, చాకుం ట, రుక్మాపూర్, కొలిమికుంట, వెదురు గట్ట, కాట్నపల్లి, కోనేరుపల్లి, రాగంపేట, రేవెల్లి, ఆర్నకొండ, పెద్ద కుర్మపల్లిలో కోతలను ముమ్మ రం చేశారు. ఐకేపీ, సింగిల్ విండోలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసే ప్రదేశాలకు తరలిస్తున్నారు. అయితే కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అపసోపాలు పడుతున్నారు. వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో ఈ సీజన్లో 11వేల ఎకరాల్లో దొడ్డు రకం, 2వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. మొత్తం 20 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాలకు రైస్‌మిల్లులు కూడా అలాట్మెంట్ చేయలేదు. ఈ క్రమంలో వేచిచూడలేక రైతులు దళారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు.
వారం క్రితమే మా ఊళ్లే కోతలు పూర్తయినయి. వడ్లల్ల తేమ లేకుండా ఆరబెట్టినం. ఇప్పటికీ సెంటర్లు పెట్టలే. చేసేదేం లేక సింగిల్ విండో, ఐకేపీ వాళ్లు కేంద్రాల పెట్టే దగ్గర వడ్లు పోసేందుకు సిద్ధమైతున్నం. మా ధాన్యం ఎప్పుడు కొంటరో అధికారులు చెప్పాలి. వెంటనే కేంద్రాలు ప్రారంభించాలి.
– నాగేల్లి రాజిరెడ్డి, రైతు, లంబాడిపల్లి (చిగురుమామిడి)
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేదుకు మేం సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే తూకం, మిషనరీ అన్నీ సమకూర్చుకున్నాం. కానీ, మాకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా ఇవ్వలే. అధికారులు చొరవ చూపాలి. మిల్లులు కేటాయిస్తే వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
– పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్
వరి కోతలు నడుస్తున్నయి. కోసింది కోసినట్టే కేంద్రాలకు తెస్తున్నం. ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో సెంటర్ల వద్దే ఉంటున్నం. కొద్దిరోజులుగా అకాల వానలు పడుతున్నాయి. చాలా ఇబ్బందులు పడి కాపాడుకుంటున్నం. ధాన్యం లారీలో ఎక్కేదాకా ఇబ్బందే ఉన్నది. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి.
– పోలే మహేశ్ రైతు, రుక్మాపూర్ (చొప్పదండి)