Sircilla | సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 8 : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవాలని సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు. ఆగస్టు 10న సోమవారం సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
పవర్లూమ్, బీడీ, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, హమాలీ, భవన నిర్మాణ, మధ్యాహ్న భోజన, ఆసుపత్రి, గార్మెంట్ తదితర రంగాల కార్మికులు ఉదయం 10 గంటలకు కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, నాయకులు సిరిమల్ల సత్యం, దాసరి రూప, సందుపట్ల పోచమల్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.