Vemulawada | వేములవాడ, మార్చి 12 : గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను ఇష్టానుసా ఇటీవలే కొత్తగా వచ్చిన పాలకవర్గాలు తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వేములవాడ నియోజకవర్గ గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు గురువారం వేములవాడ మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసం వరకు సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల ప్రకారం కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే పాలకవర్గాలు చేపట్టిన పంచాయతీలలో ఇష్టానుసారంగా కార్మికులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను కూడా వెంటనే విడుదల చేయడమే కాకుండా పది లక్షల ఆరోగ్య భద్రతను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు నరసయ్య, మహేష్, శ్రీధర్, అశోక్ తోపాటు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.