కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీ మాఫీ(Interest waiver) పథకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని 37వ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి జిహెచ్ఎంసి పరిధిలోని ఇళ్లకు మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఇంటి పన్నులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలని కోరారు. పన్నులు పకడ్బందీగా వసూలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అధికారులు ఆయా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నగరంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రాగానే ఉందన్నారు. తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆరె రవి, నాగుల కిరణ్, వర్ణాల రాజు, తదితరులు పాల్గొన్నారు.