కాంగ్రెస్ సర్కారు పాపం.. మెట్ట రైతులకు శాపంలా మారుతున్నది. ఎల్‌నినోతో తీవ్ర వర్షాభావం నెలకొంటుందని కొన్ని నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో నీటికి గోసపడే ముప్పు వచ్చింది. నాడు బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో కళకళలాడిన ప్రాజెక్టులు.. నేడు డెడ్‌స్టోరేజీకి చేరి వెలవెలబోయే దుస్థితి దాపురించింది. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి మోటర్లు ఆన్‌చేసి నీరిచ్చే అవకాశముందని సీనియర్ రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నా.. సర్కారు పెడచెవిన పెట్టడంతో మిడ్ మానేరు అడుగంటుతున్నది. మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లతోపాటు ఎగువమానేరు కూడా వెలవెలబోతుండగా, సాగునీటి కొరత తీవ్రమైంది. నారుమడులు, పత్తి పంటలను కాపాడుకునేందుకు రైతుల అరిగోస పడాల్సి వస్తున్నది.
కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలంటే సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నడు. అటు ఎల్లంపల్లిలో నీళ్లు లేవు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడడం లేదు. ప్రాజెక్టులకు నీళ్లు ఎట్ల వస్తయి. పంటలు ఎట్ల పండుతయ్. కన్నెపల్లి వద్ద నీళ్లు ఉన్నయి. వృథాగా రోజుకు లక్ష క్యూసెక్కులు పోతున్నయి. మోటర్లు ఆన్‌చేసి నీళ్లు ఇవ్వుమంటే మారక్తం కావాలని అంటున్నడు. కేసులు పెట్టుతమంటున్నడు. మారక్తం ఇస్తాం కానీ.. రైతులకు నీళ్లిచ్చి మిడ్ మానేర్, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లును నింపుమన్నం. వర్షాలు పడక నీళ్లు లేక రైతులు నారుమడులు, పత్తి పంటలను కాపాడుకునేందుకు రైతులు గోసపడుతున్నరు.
– ఈనెల 13న సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్

రాజన్న సిరిసిల్ల, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానకాలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. సీజన్ మొదలై నెలన్నర రోజులు గడిచినా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో సాగునీటికి గోస పడాల్సి వస్తున్నది. కేసీఆర్ సర్కార్ హయాంలో పండుగలా సాగు చేసుకున్నా.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు తండ్లాడుతున్నారు. నాడు కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ (మిడ్ మానేరు), మల్కపేట రిజర్వాయర్, అన్నపూర్ణ రిజర్వాయర్‌ను నింపడంతో నిరందీగా ఎవుసం చేసుకున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ముందుచూపులేక అవి వెలవెలబోతుండడంతో ఆగమవుతున్నారు. వర్షాలు పడక పోవడం, ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేసిన నారుమడులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. విత్తిన పత్తి మొలకెత్తక పోవడంతో ట్యాంకర్లు, బిందెలు, బకెట్లతో నీరు పోస్తూ కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పంపులను ఆన్‌చేసి, నీళ్లు ఎత్తిపోసి మిడ్‌మానేరు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లనును నింపాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు కరువుతో రైతులను కాటేస్తున్నదని, వర్షాల కోసం ఆకాశంవైపు దిగాలుగా చూసే దయనీయ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 4వేల ఎకరాల్లోనే నాట్లు
వానకాలం సీజన్లో సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 2.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనుండగా.. ఇప్పటివరకు కేవలం 4025 ఎకరాల్లో వరి నాట్లు సైతం వేశారు. 48,296 ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా, 46,200 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. మక్క 2వేల ఎకరాల్లో సాగు అంచనా వేయగా, ఇప్పటి వరకు 1145 ఎకరాల్లో సాగు మొదలుపెట్టారు. కందులు 1200 ఎకరాల అంచనా వేయగా, 180 ఎకరాల్లోనే వేసి సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటితోపాట పెసర, ఆయిల్ పాం ఇతర పంటలను సైతం సాగు చేస్తున్నారు. మానేరు, మూలవాగులతోపాటు జిల్లాలో సుమారు 625 వరకు చెరువులు ఉన్నా.. వర్షాలు లేక చాలా వరకు అడుగంటాయి. బోరుబావులు, వ్యవసాయ బావులు వట్టిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేసిన నారుమడులను, పత్తి పంటలను కాపాడుకోవడానికి బిందెలు, ట్యాంకర్లు, బకెట్లతో నీరు పోస్తున్నారు.
ఎగువమానేరు @ 0.5 టీఎంసీలు
గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు సామర్థ్యం 2.0 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ప్రస్తుతం 0.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 12,400 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో సాగు భూమలుకు నీరందుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.5 టీఎంసీలే ఉండగా.. రైతులు ఆందోళన చెందుతున్నారు. బోరుబావులు, వ్యవసాయ బావులపై ఆధార పడే నార్లు పోసుకున్నారు.

ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన
బోయినపల్లి మండలం మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు(మిడ్ మానేరు) 27. 55 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నది. ప్రస్తుతం 7.455 టీఎంసీలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈప్రాజెక్టులో డెడ్‌స్టోరేజీ 6.3 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గ్రావిటీ ద్వారా 80వేల ఎకరాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టు ఎడమ, కుడికాలువ పరిధిలో నీళ్లందితే బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో 53వేల ఎకరాలకు 30వేల ఎకరాల్లో వరితోపాటు పత్తి సాగు చేస్తున్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం, వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోరుబావులు, వ్యవసాయ బావులు కూడా ఎత్తిపోయే పరిస్థితి ఉన్నది. ఇవి కూడా ఎత్తిపోతే పంటలు నీరందక ఎండిపోయే దుస్థితి ఉన్నది.
అన్నపూర్ణ రిజర్వాయర్ @ 1.45 టీఎంసీలు
ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ 3.50టీఎంసీల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం 1.45 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ రిజర్వాయర్‌కు ఆయకట్టు 32వేల ఎకరాలు ఉన్నది. ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందిస్తున్నది. ఈ ప్రాజెక్టులో1.45 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నప్పటికీ ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగు నీళ్లు ఇస్తారని ఆశతో రైతులు నారు పోసుకుని ఎదురుచూస్తున్నారు. నీళ్లు లేక నార్లు ముదురుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
మల్కపేట రిజర్వాయర్ @ ఒక టీఎంసీ
కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థం 3.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీటి నిల్వ ఉన్నది. ఈ రిజర్వాయర్ పరిధిలో మండలంలోని 10వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అంతేకాదు, కాలువల ద్వారా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగసముద్రం నిండి ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లితోపాటు సిరిసిల్ల అర్బన్ మండలంలోని భూములకు సాగునీటి గోస తీరుతుంది.