– గ్రామ సమాఖ్యల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్
కారేపల్లి, సెప్టెంబర్ 23 : చేయూత పెన్షన్ల అమలు, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై మహిళా సంఘం గ్రామ సమాఖ్యల ప్రతినిధులతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సంబంధిత పథకాల అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. చేయూత పెన్షన్లకు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సకాలంలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సీఈవో గ్రామ సమాఖ్య మహిళా సంఘం నాయకులకు(విఓఏ) సూచించారు. గ్రామస్థాయిలో లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తూ, సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని గ్రామ సమాఖ్యల ప్రతినిధులకు సూచించారు.
అలాగే పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫామ్ల నాణ్యత, తయారీ, పంపిణీ ప్రక్రియపై సమీక్షించారు. విద్యార్థులకు యూనిఫామ్లు నిర్ణీత సమయంలో అందేలా మహిళా సంఘాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పథకాల అమలులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సెర్ప్ సీఈవో స్పష్టం చేశారు. గ్రామ సమాఖ్యలు ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నందున, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, సీసీలు గౌసియా బేగం, జైపాల్, ప్రసాద్, పద్మ, రాజేశ్వరి, సుమ, రేణుక, వీరస్వామి, అకౌంటెంట్ నాగుబండి నాగలక్ష్మి, గ్రామ సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ దీపికలు పాల్గొన్నారు.