Sunke Ravi Shankar | గంగాధర, మార్చి 22 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లును ప్రభుత్వం ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసం చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. గంగాధర మండలంలోని మధురానగర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ వర్గానికి అనుకూలంగా లేదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కరువుతో అల్లాడిందని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాడని గుర్తు చేశారు. ప్రజలకు న్యాయం చేకూరేలా నాటి కేసీఆర్ బడ్జెట్ ఉంటే, ప్రజలను మోసం చేసేలా రేవంత్ రెడ్డి బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.23,170 కోట్లు మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు రైతుబంధు ఇవ్వడానికి మాత్రమే సరిపోతుందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు అమలు చేసే, చట్టబద్ధత కల్పించడానికి తొలి సంతకం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు, దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.2 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్, సెక్రటేరియట్, కలెక్టరేట్ భవనాలు కట్టించారని, మెడికల్ కాలేజీలు, గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారని, ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.3లక్షల27 వేల కోట్ల అప్పు చేసి ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో 60 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సూట్ కేసులో తీసుకువెళ్లి రాహుల్ గాంధీకి ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, రామిడి సురేందర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ఎండీ నజీర్, మడ్లపెల్లి రమేష్, ముక్కెర మల్లేశం, నాగారపు సత్యనారాయణ, ఆకుల శంకరయ్య, రాసూరి మల్లేశం, పంజాల ఆంజనేయులు, దోమకొండ మల్లయ్య, ఎండీ అబ్బాస్, మామిడిపల్లి అఖిల్, గంగాధర నగేష్, గుడిసె తిరుపతి, కళ్లేపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.