జగిత్యాల, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ దోపీడీకి దిగుతున్నది. వాహనాల నిలుపుదల రెంట్ పేరిట ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నామని ఊకదంపుడు ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్, ఆ పథకం మొదలు పెట్టిన తర్వాత జనవరి నుంచే మోటార్ సైకిల్, సైకిల్ స్టాండ్ల అద్దెను రెండింతలకు పెంచేసింది. నిత్యం బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నది. కరీంనగర్ రీజియన్‌లోని బస్టేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి రోజు వారీ కిరాయి కాకుండా గంటల వారి రెంట్ పెట్టి గుంజుతున్నది. కేవలం ఆర్టీసీకి లాభం జరిగేలా టైమింగ్స్‌ను ఏర్పాటు చేసి, 4 గంటలకైనా 24 గంటలకైనా ఒకటే రేటు వసూలు చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్ రీజియన్‌లో బస్టాండ్లను ఆర్టీసీ కేటగిరీలుగా విభజించింది. కరీంనగర్, జగిత్యాల, హుస్నాబాద్ బస్టేషన్లను ఏ కేటగిరీగా గుర్తించింది. ఇక కార్పొరేషన్ అయిన గోదావరిఖని, జిల్లా కేంద్రమైన పెద్దపల్లి, కోరుట్ల, మెట్పల్లి, హుజూరాబాద్, వేములవాడ బస్టాండ్లను బీ కేటగిరీ కింద పేర్కొన్నది. సుల్తానాబాద్, కేశవపట్నం, ఎల్లారెడ్డిపేటతోపాటు ఇతర బస్టాండ్లను సీ కేటగిరీలో చేర్చింది. అయితే ఏ పారమీటర్ ఆధారంగా బస్టాండ్లను కేటగిరీలుగా విభజించిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, హుస్నాబాద్‌ను మాత్రమే ఏ కేటగిరీ బస్టాండ్లుగా పేర్కొనడం మిగిలిన వాటిని బీ, సీ కేటగిరీలో వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ కేటగిరీల ప్రకారం బస్టాండ్లలో ఏర్పాటు చేసిన ఆటో, సైకిల్, మోటర్ సైకిల్ స్టాండ్స్‌కు సం బంధించిన కిరాయిలను నిర్ణయించింది. ఈ కిరాయిల ఆధారంగా స్టాండ్లకు వేలం వేసి కాంట్రాక్టర్లకు అప్పగించింది.
అడ్డగోలుగా కిరాయిలు
ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన సైకిల్, మోటర్ సైకిల్ స్టాండ్లలో ఆర్టీసీ గంటల లెక్కన కిరాయిలు వసూలు చేస్తున్నది. ఏ కేటగిరీలో కరీంనగర్, జగిత్యాల, హుస్నాబాద్ బస్టాండ్లలో ఉన్న మోటర్ సైకిల్ స్టాండ్‌లో గంట లోపు వాహనం ఉంచితే 10 వసూలు చేస్తున్నది. గంట నుంచి నాలుగు గంటల లోపు పార్క్ చేస్తే 25 తీసుకుంటున్నది. ఇక 4 గంటలకు ఒక్క నిమిషం దాటినా 40 వసూలు చేస్తున్నది. బీ కేటగిరీలో గంట లోపు అయితే 10, గంట నుంచి 4గంటల లోపు అయితే 15, నాలుగు గంటలు దాటితే 25 తీసుకుంటున్నది. సీ కేటగిరీలో గంటల లోపు అయితే 10, గంట నుంచి 4 గంటలలోపు అయితే 15, నాలుగు గంటల పైన, 24 గంటల లోపు అయితే 20 వసూలు చేస్తున్నది. ఈ ధరలన్నీ ఈ యేడాది జనవరి నుంచి ఆర్టీసీ అమలులోకి తెచ్చింది. గతంలో ఉన్న స్టాండ్ కిరాయిల కంటే ఈ కిరాయిలు దాదాపు రెట్టింపు కావడంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగిత్యాల, కరీంనగర్, హుస్నాబాద్ బస్టాండ్లలో గంటలోపు వాహనం ఉంచితే 5 వసూలు చేసేదని, ఇప్పుడు ఏకంగా రెట్టింపు చేశారని మండిపడుతున్నారు. గంట నుంచి 4 గంటల లోపు ధరను 15 నుంచి 25కు పెంచారని, ఇక 4 గంటలపైన 24 గంటల లోపు స్టాండ్‌లో పెట్టిన వాహనానికి గతంలో 25 కిరాయి ఉండగా, ఇప్పుడు ఏకంగా 40 చేశారని చెబుతున్నారు.
బీ కేటగిరిలోనూ పెంపు భారీగానే ఉంది. గతంలో గంటలోపు 5 కిరాయిని, ఇప్పుడు 10కి పెంచింది. గతంలో 4 గంటల లోపు వాహనానికి 12 వసూలు చేయగా, ఇప్పుడు 15 చేసింది. 4గంటల నుంచి 24 గంటల మధ్య ఉన్న వాహనానికి గతంలో 20 ఉండగా, ఇప్పుడు 25 వసూలు చేస్తున్నది.
సీ కేటగిరిలో గంట లోపు గతంలో 5 ఉండగా, ఇప్పుడు 10 చేసింది.4 గంటల లోపు కిరాయి గతంలో 6 ఉండగా, ఇప్పుడు 15 వసూలు చేస్తున్నది. 4 గంటల నుంచి 24 గంటల లోపు 12 వసూలు చేయగా, ఇప్పుడు 20 వసూలు చేస్తున్నది. ప్రతి కేటగిరిలోనూ కిరాయిల పెంపు 40 నుంచి 50 శాతం వరకు ఉండగా, వాహనదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
గంటల లెక్కన వసూలుపై విమర్శలు
ఆర్టీసీ బస్టాండ్లలో మోటర్ సైకిల్, సైకిల్ స్టాండ్లలో గంటల లెక్కన కిరాయిలు వసూలు చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. సాధారణంగా 24 గంటలు ఉన్న రోజులో 8 గంటలు రాత్రి, 8 గంటలు పని సమయం, 8 గంటలు వ్యక్తిగత అంశాలకు కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ 8 గంటల పనిదినాన్ని నిర్దేశించాయి. అందులోనూ 4 గంటలకు ఒక సెషన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఒక టీచర్, లేదా అధికారి ఎవరైనా, అరపూట సెలవు పెట్టారంటే, నాలుగు గంటలు సెలవు పెట్టారనే అర్థం. ఈ విషయం అందరికీ తెలిసిందే. వేతనాలు సైతం ఇదే పద్ధతిలో చెల్లింపు జరుగుతున్నది. ఎక్కడైనా ఇదే పద్ధతి అమలవుతుండగా, ఆర్టీసీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వాహనాన్ని గంటలోపు పార్క్ చేస్తే 10 వసూలు చేయడం, 4 గంటల లోపు అయితే మరింత ఎక్కువ రేటు వసూలు చేయడం, 4 గంటలు దాటితే 24 గంటల రేటును వసూలు చేయడాన్ని ప్రయాణికులు తప్పు పడుతున్నారు. గంటలోపు స్టాండ్‌లో వాహనం పార్క్ అనే విషయం అసహజంగా ఉందంటున్నారు. బంధువులు, స్నేహితులకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చేవారికి మాత్రమే గంట లోపు పద్ధతి ఉపయోగపడుతుందని, సహజంగా, సెండాఫ్ ఇచ్చేవారు ఎవరూ మోటర్ సైకిల్‌ను బస్టాండ్‌లో పార్క్ చేయరని వాహనదారులు చెబుతున్నారు. ఇక గంట నుంచి నాలుగు గంటల లోపు వాహనాన్ని పార్కింగ్ చేసేవాళ్లు సైతం ఉండరంటున్నారు.
మోటర్‌సైకిల్‌ను బస్టాండ్‌లో పార్క్ చేస్తున్నారంటే కనీసం ప్రభుత్వ, ప్రైవేట్ విధులకు హాజరయ్యే ఉద్యోగులు, కార్మికులే అయి ఉంటారని, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ 4 గంటల లోపు వాహనాన్ని తీసుకువెళ్లే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. నాలుగు గంటల లోపు వాహనాన్ని తీసుకునే వారి సంఖ్య కనీసం రెండు మూడు శాతం సైతం ఉండదంటున్నారు. ఉద్యోగులు, కార్మికులు 8 గంటల పని సమయం, ప్రయాణానికి మరో రెండు గంటలు వేసుకుంటే, 10 నుంచి 12 గంటలు పార్కింగ్ చేస్తారని చెబుతున్నారు. 12 గంటల పార్కింగ్‌కు ఒక కిరాయి ధర నిర్ణయించాల్సి ఉండగా, అలా చేయకుండా ఇరవై నాలుగు గంటల కిరాయి వసూలు చేస్తుండడం దోపిడే అని వారు విమర్శిస్తున్నారు. పైకి చూసేందుకు మోటర్ సైకిల్ స్టాండ్ కిరాయి చిన్న విషయంగా కనిపించినా, ఒక్కో వ్యక్తి రోజుకు 20 అదనంగా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. నెలకు 600 చొప్పున లెక్కవేస్తే, ఏడాదికి 7వేల వరకు మోటర్ సైకిల్ స్టాండ్‌కు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నదని వాపోతున్నారు. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి లాంటి బస్టాండ్లలో రోజుకు వేలాది మంది బైక్‌లు పార్క్ చేస్తున్నారని, వారందరి వద్ద నుంచి వసూలు చేస్తున్న డబ్బులను లెక్కిస్తే, లక్షల్లో ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, ఈ విషయమై అభిప్రాయం చెప్పాలని కొందరు వాహనదారులను కోరగా, ‘సార్ వాయిస్ ఇస్తే. నా మోటర్ సైకిల్‌కు రోజు పంక్చర్ చేసి, ఇబ్బందిపెడుతారు. వద్దు సార్’ అంటూ సున్నితంగా తప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
నిబంధనల ప్రకారమే
ఆర్టీసీ నిబంధనల ప్రకారమే ద్విచక్ర వాహనాల స్టాండ్లను నిర్వహిస్తున్నాం. అందులో ఎలాంటి మార్పులు లేవు. గతంలోనూ గంటల పద్ధతిలోనే కిరాయిలు వసూలు చేశాం. అయితే గతంలో ఉన్న స్టాండ్ల ధరలను ఆర్టీసీ ఈ యేడాది సవరించింది. జనవరి 21న కొత్త రేట్లతో మెమోను జారీ చేసింది. దాని ప్రకారమే ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న వాహన స్టాండ్లను నిర్వహించాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. కొత్తగా పెంచిన కిరాయి ధరలను స్టాండ్‌లో ఫ్లెక్సీద్వారా ప్రదర్శిస్తున్నాం. ఏ కేటగిరీ బస్టాండ్‌లో 4 గంటల పైన పార్కింగ్ చేసిన వాహనానికి 35 కిరాయి వసూలు చేయాలని ఉంది. అయితే 5 సెస్‌తో కలిపి వాహనాదారుడి నుంచి 40 వసూలు చేస్తున్నాం.
– సునీత, జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్