Dharmaram | ధర్మారం, మే 29 : 2026-27 విద్యా సంవత్సరం నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు పాఠశాల హెడ్మాస్టర్ సముద్రాల వంశీ మోహన చార్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ధర్మారం మండలంలో 3 పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం వచ్చిన ఆదేశాల మేరకు తమ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. తమ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చిన జిల్లా విద్యాధికారిణి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, హెచ్ఎం మోహనా చార్యులు కృతజ్ఞతలు తెలిపారు. తరగతులు నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్ స్ట్రక్టర్(టీచర్) ఒక ఆయాను నియమిస్తుందని పిల్లలు ఆహ్లాదకరమైన ఆటలతో ఉల్లాసవంతమైన వాతావరణంలో నేర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. కంప్యూటర్ ప్లే వే మెథడ్ లో బోధిస్తామని తెలిపారు. రచ్చపల్లి గ్రామం తో పాటు పరిసర గ్రామాల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.