Karimnagar | హుజూరాబాద్ టౌన్, మే 29 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ దళితబంధు సాధనసమితి సభ్యులను హుజూరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సాధనసమితి సభ్యులు మాట్లాడుతూ.. దళితుల అరెస్టులు అక్రమమని అన్నారు. దరఖాస్తు ప్రక్రియల్లో నిమగ్నమై ఉన్నామని తెలిపినా పోలీసులు విడిచిపెట్టలేదని అన్నారు. ప్రభుత్వం అరెస్టుల పేరుతో ఇబ్బందిపెడుతోందని వారు మండిపడ్డారు. అరెస్టైన వారిలో అకినపల్లి ఆకాష్, శనిగరం రవీందర్, శనిగరం రాజు, శనిగరం సమ్మయ్య, శనిగరం బుచ్చయ్య ఉన్నారు.