Election Schedule : దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈసీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక పశ్చిమబెంగాల్ రెండు విడుతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడుత పోలింగ్ ఏప్రిల్ 23న, రెండో విడుత పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనుంది. మే 4న నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో శాసనసభల పదవీకాలం మే, జూన్‌ల నెలల్లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను కూడా ఈసీ పూర్తిచేసింది. క్షేత్ర స్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అందులో తమిళనాడులో 234, పశ్చిమబెంగాల్లో 294, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం 2.19 కోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ విధుల్లో మొత్తం 25 లక్షల మంది అధికారులు పాల్గొననున్నారు.