కలెక్టరేట్, మార్చి 11: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణికి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ పమేలా సత్పతికి అర్జీలు అందించి, తమ సమస్యలు చెప్పుకొన్నారు. వారి సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్ పమేలా సత్పతి, ఫిర్యాదుదారులు అందించిన అర్జీలు సమగ్రంగా పరిశీలించి, సత్వరమే పరిష్కార మార్గం చూపాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్‌లో ఉంచొద్దని, గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు విధిగా హాజరుకావాలని సూచించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులపై బుధవారం నుంచి సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, తదితర అంశాలతో మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహించొద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో కే మహేశ్వర్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.