మెట్పల్లి రూరల్, సెప్టెంబర్ 17: నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు వృద్ధాప్యం లో తన సంరక్షణ చూసుకుంటాడునుకున్న ఆ తల్లికి నిరాశే ఎదురైంది. కొడుకు తీరుపై అధికారులకు విన్నవించినా ఫలితం దక్కకపోవడంతో మెట్పల్లి ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు రాజు అనే వృద్ధురాలికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. 20 ఏళ్ల క్రితమే వీరందరికీ వివాహాలు చేశారు.
ఆరు నెలల క్రితం వృద్ధురాలి భర్త రాజగంగారాం అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే, కొడుకు ఏనుగు మోహన్‌రెడ్డి తల్లి బాగోగులు చూసుకోకపోవడంతోపాటు తండ్రి వైద్య ఖర్చులు రూ.1.20 లక్షలు సైతం ముగ్గురు కూతుళ్లే భరించారు. దీంతో జూలై 4న వృద్ధురాలు ‘ప్రజావాణి’లో జగిత్యాల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మెట్పల్లి ఆర్డీవో వృద్ధురాలి కొడుకు మోహన్‌రెడ్డిని పిలిచి వాదప్రతివాదాలు విన్నారు.
వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం-2007 ప్రకారం తల్లి రాజుకు కొడుకు మోహన్‌రెడ్డి ప్రతినెలా రూ.2,500 చెల్లించాలని జూలై 18న ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ కొడుకు డబ్బులు చెల్లించకపోవడంతో వృద్ధురాలు తనకు న్యాయం చేయాలంటూ మెట్పల్లి ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఎన్నిసార్లు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని, రేపు రా, మాపు రా అంటూ తిప్పించుకొంటున్నారని వాపోయింది. అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కాగా, మంగళవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించిన అధికారులు.. తనకు న్యాయం చేయాలని వచ్చిన వృద్ధురాలిని ఇంటికి పంపించడం కొసమెరుపు.