SIRICILLA BRS | సిరిసిల్ల టౌన్, మార్చి 31: విద్యార్థులపై పండుగపూట పోలీసులు అత్యుత్సాహం చూపించారని, యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను చదును చేసేందుకు వచ్చిన అధికారులు వందలాది మంది పోలీసుల పహారాలో పదుల సంఖ్యలో జేసీబీలతో పనులు చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డుకున్న విద్యార్థులను లాఠీలతో బాదడం, బట్టలు చిరుగుతున్నా వారిని లాక్కెళ్లి వాహనాల్లో ఈడ్చుకెళ్లడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
200 మందికి పైగా విద్యార్థులను అరెస్ట్ చేసి సిటీలోని పలు ఠాణాలకు తరలించారని ఈ అక్రమ అరెస్టులను భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదేనని, యూనివర్సిటీ ఎదుట బైఠాయించిన విద్యార్థులను విడుదల చేసేదాకా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం విద్యార్థుల పక్షాన పోరాడుతుందన్నారు.
విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే పెట్టుకొని విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఇదేనా ప్రజాపాలన అని మండిపడ్డారు. ఈ సంఘటనను కవరేజీ చేసేందుకు వెళ్లిన మీడియా పైన కూడా పోలీసులతో దాడి చేయడం కూడా సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, ముగ్దం అనిల్, వెంకటేష్, అడిచెర్ల సాయి, రాజు, మహేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.