జ్యోతినగర్(రామగుండం), సెప్టెంబర్ 14 : రామగుండం రైల్వేస్టేషన్ మీదుగా సోమవారం నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతున్నది. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు ప్రతి రోజూ రామగుండంలో హాల్టింగ్ కానున్నది. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించనుండగా, అదే రోజు రాత్రి 8.20 గంటలకు రామగుండం రైల్వేస్టేషన్ రెండో ప్లాట్ ఫాంకు రానున్నది.
ఈ మేరకు రైలు ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారాకి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, వందే భారత్ రైలు ప్రతిరోజూ రెగ్యులర్గా నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్కు వరకు ప్రయాణిస్తుంది. నాగ్పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి ఉదయం 9:08 గంటలకు రామగుండానికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి మూడు గంటల్లో సికింద్రాబాద్కు మధ్యాహ్నం 12.15 గంటలకు రీచ్ అవుతుంది.
రామగుండం నుంచి సికింద్రాబాద్ ప్రయాణానికి ఒకరికి చైర్కార్లో రూ.765, వీఐపీ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో రూ.1,420 చొప్పున టికెట్ చార్జీలు నిర్ణయించారు. అయితే, తిరుగు ప్రయాణ టైంటేబుల్ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. సోమవారమే విడుదల చేసే అవకాశం ఉంది.