ELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట మార్చి 31 : గత కొంతకాలంగా మిషన్ భగీరథ పైపు లైన్ సమస్య కారణంగా గుండారంలోని పోచమ్మ తండావాసులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘పండగ పూట మంచినీళ్ల కోసం నిరసన’ పేరిట సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన దరిమిలా అధికారులు స్పందించారు.
ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ఆదేశాలతో ట్యాంకర్ తో నీరు అందించడం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు. ఇందుకోసం సీసీ రోడ్డు నిర్మాణం సమయంలో తెగిన పైప్ లైన్ గుర్తించేందుకు ఎక్స్ కవేటర్ తో మట్టిని తీసి పైపు లైన్ కు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి దేవరాజు మాట్లాడారు. సాయంత్రం ట్యాంకులో మిషన్ భగీరథ నీటి నింపి పైప్ లైన్ ద్వారా సాయంత్రం నుంచి అందిస్తున్నామని అన్నారు.
ఇందుకు సంబంధించిన మరమ్మతు పనులు పూర్తి చేశామని తెలిపారు. కొందరు తమ పొలాల నుంచి తీసిన మిషన్ భగీరథ పైపును ఏదైనా కారణం చేత ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.