Koppula Eshwar | ధర్మారం, డిసెంబర్ 7 : ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస రాంబాబుకు మద్దతుతో పాటు సర్పంచ్ అభ్యర్థుల సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లను దండుకొని ఆ తర్వాత మొండి చేయి చూపిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలను వంచిందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి మట్టి కనిపించాలని ఆయన సూచించారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్ల సొమ్ము ఎందుకు పెంచలేదని ఆయన ప్రశ్నించారు. మహిళలకు నెలనెలకు రూ.2,500 ఇస్తామన్నా హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.లక్ష నగదు, తులం బంగారం ఎందుకు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. ధర్మారం మండలం అభివృద్ధికి తాను మంత్రి హయంలో ఎంతో కృషి చేశానని ఇందులో భాగంగా నంది మేడారంలో 30 పడకల దవాఖాన భవనం కట్టించామని, ధర్మారంలో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయించానని, మహిళా సంఘ భవనాలు, కుల సంఘ భవనాలు నిర్మించాలని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ధర్మారం మరింత అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ బలపరిచిన మానస రాంబాబు అభ్యర్థిని సర్పంచిగా గెలిపించాలని ఆయన సూచించారు.
మండలంలో అత్యంత ధర్మారం మండల కేంద్రంలో పార్టీ బలపరిచిన తుమ్మల మానస రాంబాబు గెలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సర్పంచ్ అభ్యర్థి మానస రాంబాబుకు మద్దతుగా ఉండడానికి పార్టీ నిర్దేశించిన ప్రకారం పోటీ నుంచి ఉపసంహరించుకున్న మాజీ ఉప సర్పంచ్ ఆవుల లతను ఈశ్వర్ అభినందించారు. లత మానస రాంబాబు విజయానికి కృషి చేస్తారని, ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకుల మధ్య ప్రకటించారు. అందరూ అంకితభావంతో పనిచేస్తే ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో నంది మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, నాయకులు జితేందర్ రావు, రామారావు, కాంపల్లి చంద్రశేఖర్, దేవి నలినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకంపల్లి సర్పంచ్ షైనేని రవిని మాజీ మంత్రి ఈశ్వర్ ఈ సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.