JAGITHYAL | జగిత్యాల, మే 03 : ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు, సూచనలు పాటించాలని చెప్పారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమని చెప్పారు. ఎప్పటికప్పుడు మంచి నీరు, గ్లూకోజ్, ఎలక్ర్టోరల్ పౌడర్ వంటివి అందించాలని ఆదేశించారు.
వీలైనంత వరకు వృద్ధులు, చిన్నారులను గాలి ఆడే ప్రదేశాల్లో ఉండేలా చూడాలని, జాగ్రత్తలు పాటించడం ద్వారా వడదెబ్బ మరణాలు అరికట్టవచ్చని, ఎండతీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి (104 డిగ్రీలఫారన్ హీట్) మెదడు మీద ప్రభావం చూపుతుందని తెలిపారు. చెమట, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు, మగత నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక్షంగా అపస్మారక స్థితి, ఎండలో బయటకు వెళ్లినప్పడు ఈ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని వైద్యుడిని సంప్రదించి ప్రాథమిక చికిత్స పొందాలని సూచించారు.
వడదెబ్బ బారిన పడకుండా గొడుగు వాడడం, తెలుపురంగు లేదా పలుచని చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పారు. తలకు టోపీ కానీ రుమాలు కానీ వాడాలని, వేడిగాలులు తగలకుండా చూసుకోవాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరుబయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయవద్దని సూచించారు. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పడు ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తరువాత చేయాలని సూచించారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ప్రదేశానికి తీసుకు వెళ్లాలని, చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో శరీరం తుడవాలని, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు అలాగే చేస్తూ ఉండాలని సూచించారు.
అధికారులు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, మజ్జిగ వంటివి సరఫరా చేయాలని కోరారు. వడగాలుల ప్రభావం సామాన్యప్రజలపై పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాల చెప్పారు. ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా వేడి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులను రెండు బృందాలుగా విభజించి కనీసం గంట లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేషన్ పద్ధతి అవలంభించేలా చూడాలని సూచించారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్ధనా స్ధలాల వంటి పబ్లిక్ ప్రాంతాలలో అవసరమైన షెల్టర్లు, తాగునీరు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ తెలిపారు.