మెట్పల్లి, ఆగస్టు 9 : రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ ఏజెన్సీలు తమ సరుకుల నిల్వ కోసం బీఆర్ఎస్ పాలనలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన పలు గోదాములు ఖాళీగా మిగిలాయి. సరుకులు నిల్వ చేయకపోవడం, గోదాంల సామర్థ్యం, అద్దెకు సంబంధించి సరైన అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం కారణంగా గోదాముల వినియోగం నిర్వీర్యమవుతోంది. పసుపు క్రయ, విక్రయాల్లో రాష్ట్రంలోనే నిజామాబాద్ మార్కెట్ తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్ మెట్పల్లి వ్యవసాయ మార్కెట్. ఇక్కడ ప్రతి ఏటా టన్నుల కొద్ది పసుపు క్రయ,విక్రయాలు జరుగుతుంటాయి. అదే విధంగా మార్కెటింగ్ ఏజెన్సీలు అయినా మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయ్ సంస్థలు ప్రతి ఏటా వాన కాలం, యాసంగిలో పండించే వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతుంది. ఆయా సరకుల నిలువలకు సరిపడా గతంలో గోదాముల కొరత ఉండేది. 2014కు ముందు ఇక్కడ 2వేలు మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములు మాత్రమే ఉండేవి. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తమ పంటలను నిలువ చేసుకునేందుకు సౌకర్యం కోసం 5 వేలు మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో కలిగిన రెండు గోదాముల నిర్మాణాన్ని తలపెట్టింది.
అందుకు రూ. 6 కోట్ల నిధులు కేటాయించింది. 2015 ఆగస్టు 31న అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ఈ గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక్కో గోదాం 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మూడు కంపార్ట్మెంట్లతో నిర్మించగా కొన్ని సంవత్సరాలుగా పూర్తి సామర్థ్యంతో సరుకుల నిలువలు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. బీఆర్ఎస్ పాలన కంటే ముందు దాదాపు నలభై ఏళ్ల కిందట నిర్మించిన 2 వేలు మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో కలిగిన రెండు గోదాములకు సంబంధించి ఒకటి శిథిలావస్థకు చేరువలో ఉండగా మరొకటి ప్రస్తుతం పీడీఎస్ బియ్యం, గన్నీ సంచుల నిలువకు వినియోగిస్తున్నారు. అదే విధంగా కొత్తగా నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల గోదాములు రెండు ఉండగా అందులో ఒక గోదాములో మూడు కంపార్ట్మెంట్లకు గాను రెండు కంపార్ట్మెంట్లలో పీడీఎస్ బియ్యం నిలువకు ఉపయోగిస్తుండగా మరో కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది. ఇంకో గోదాములోని మూడు కంపార్ట్ మెంట్లు గత కొంత కాలంగా పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. సరైన అవగాహన లేకపోవడం, అద్దె ఎక్కువ మొత్తంలో ఉండటంతో ప్రైవేట్ వ్యాపారులు లీజు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరో సారి ప్రభుత్వ ఏజెన్సీలు సీజన్లలో ఒకటి రెండు కంపార్టు మెంట్లు తీసుకొని ఆ తర్వాత ఖాళీ చేస్తున్నారు. తీసుకున్న కాలానికి అద్దె చెల్లించడంలోనూ నిధులు రాలేదని ఆయా ఏజెన్సీలు సకాలంలో మార్కెట్ కమిటీకి అద్దె బకాయిలు చెల్లించడం లేదు. గోదాములకు సంబంధించి ఎక్కువ భాగం సరుకుల నిలువ లేక ఖాళీగా ఉండటంతో మార్కెట్‌కు అద్దె రూపంలో రావాల్సిన ఆదాయం అందలేకపోతున్నది.
రూ. కోట్లాది వ్యయంతో నిర్మించిన గోదాముల నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలనా..పాలన కొరవడంతో అవి ప్రభావాన్ని కోల్పోతున్నాయి. గోదాముల చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పేరుకు పోతున్నాయి. దీని వల్ల పాములు, తేళ్లు వంటి విష పురుగులు, పందులు, కుక్కలు, పశువులు సంచరిస్తున్నాయి. గోదాముల ముఖ ద్వారాల వైపు ఉన్న ప్లాట్ ఫాంలు మందు బాబులు, పేకాట, జూదరులకు అడ్డాగా మారాయి.
మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన గోదాముల అద్దెకు సంబంధించి మార్కెట్ కమిటీకి రూ.80.99 లక్షలు రావాల్సి ఉంది. సివిల్ సప్లయి సంస్థ నుంచి ఈ అద్దె వసూల్ కావాల్సి ఉండగా పలు మార్లు మార్కెట్ కమిటీ నుంచి ఆ సంస్థకు నోటీసులు పంపించారు. వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్ల మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన అద్దె బకాయి లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు.