పెద్దపల్లి, సెప్టెంబర్ 30 : జిల్లాలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్లో మంగళవారం డీసీపీ కరుణాకర్‌తో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. రెండు విడతలలో స్థానిక సంస్థలను, 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. కాగా జిల్లాలో మొదటి విడతలో 7 మండలాలు, రెండవ విడుదల 6 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు భద్రత బలగాలు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు.
ఎన్నికల కోడ్ అమలలో ఉంటుందని, ఓటర్లను ప్రభావితం చేసేలా ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రీ -పోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.
డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్, నామినేషన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మేర పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు బీ గంగయ్య, కే సురేష్, జడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, ఏసీపీలు కృష్ణ, రమేష్, జిల్లా నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.