కాల్వ శ్రీరాంపూర్ : పంటపొలానికి మోటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock) తగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన నక్కల రవి(30) అనే రైతు తన పొలానికి సాగునీరు పెట్టడానికి వెళ్లి స్టార్టన్ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
అటువైపున గొర్రెల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య అనుషతోపాటు కూతురు హర్షిని, కొడుకు అద్వైత్ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గాజనమైన సదయ్య, పెగడపల్లి మాజీ సర్పంచ్ అరెల్లి సుజాత పరామర్శించారు. కాగా, సంఘటన స్థలానికి కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రవి మృతితో పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.