పెద్దపల్లి రూరల్ నవంబర్ 25 : గ్రామపంచాయతీలలో పనిచేసే వర్కర్స్ అందరు ఆరోగ్యంగా ఉంటేనే వారి పనితీరు మెరుగుగా ఉండి గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ లో మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తులతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ద్య కార్మికుల ఆరోగ్యం విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సుచించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో కార్మికులకు దుస్తులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు.
కొన్ని గ్రామాల్లో స్థానిక పరిస్థితులను బట్టి దశలవారిగా పంపిణీ చేస్తారన్నారు. ప్రదానంగా గ్రామాల్లో పారిశుద్ద్య కార్యక్రమాలు సజావుగా సాగాలంటే కార్మికుల ఆరోగ్యం, వారి పనితీరు బాగుండాలన్నారు. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉన్నారని వాటిని భర్తీ చేసి వెంటనే వసూళ్లు పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తూము రవిందర్ , బిల్ కలెక్టర్ బుచ్చయ్య , కార్మికులు పాల్గొన్నారు.