పెద్దపల్లి రూరల్, జూలై 4: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పకడ్బందిగా బాధ్యతలు నిర్వర్తించాలని పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్య అన్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలు, సిబ్బందికి ఎన్నికల నిబంధనలు నిర్వహణ తీరుపై అవగాహనతో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే పెద్దపల్లి మండలంలోని బూత్ స్థాయి అధికారులకు పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వో సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.
ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8ల విచారణ, నివేదిక సమర్పించడం, బూత్ లెవల్ అధికారి యాప్ వాడకం, ఓటర్ల జాబితా శుద్ధీకరణపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆ దిశగానే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పరిధిలోనే విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్, నాయిబ్ తహసీల్దార్ విజేందర్, ఎన్నికల విభాగం నాయిబ్ తహసీల్దార్ రవిందర్, మాస్టర్ ట్రైనర్లుగా హెచ్ ఎంలు పురుషోత్తం, ఆగయ్య, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.