పెద్దపల్లి, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): హన్మకొండ జిల్లాలో ప్రముఖ సీనియర్ న్యాయవాది(Lawyer) గంధం శివపై హన్మకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డితో పాటు మరికొంతమంది పోలీసులు(Traffic police) దాడి చేయడం దుర్మార్గమైన చర్యని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇనుముల సత్యనారాయణ విమర్శించారు. పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. సదరు న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా నానా దూర్భాషలు ఆడి వారిపైనే కేసు పెట్టడం అనైతికమన్నారు.
రాష్టంలో విధి నిర్వహణలో కొన్నిచోట్ల కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ నేతల ప్రసన్నం కోసం, పోస్టింగ్స్ కోసం న్యాయవాదులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం సర్వ సాధారణం అయిందన్నారు. హన్మకొండ ట్రాఫిక్ సిఐ, పోలీసులు చేసిన దాడిపై కేసు కూడా నమోదు చేసిన ప్రభుత్వం వెంటనే విచారణ కూడా జరిపించి సదరు సిఐతో పాటు పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. భవిష్యత్ లో న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అయన ప్రభుత్వాన్ని కోరారు.