పెద్దపల్లి రూరల్ : అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన మ్యాదరబోయిన మహేష్- రజిత దంపతుల మూడు నెలల బాబు నియాన్స్ గురువారం తెల్లవారు జామున అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.
బాధితుల కథనం మేరకు..నెల వారి టీకాలు వేయించే క్రమంలో బుధవారం కనగర్తిలో రాగినేడు ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిచే మూడో నెల టీకా వేయించామన్నారు. ఆ టీకా వేయించక ముందు బాబు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.
వైద్య సిబ్బంది వేసిన టీకా కారణంగానే తెల్లవారే సరికి నియాన్స్ మృతి చెందాడని ఆరోపించారు.
ఈ విషయమై రాగినేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్ ఫణీంధ్ర వివరణ ఇస్తూ.. బాబు మృతిపై ఉన్నతాధికారులు పరిశీలన చేశారన్నారు. జిల్లా వైద్యాధికారులు తెలిపిన ప్రకారం బాబుకు పాలుపట్టే సందర్భంలో జరిగిన ఇబ్బంది వల్లే మృతి చెందినట్లు డాక్టర్ ఫణీంద్ర వివరించారు.