Theft Mistery | కోల్ సిటీ, జూలై 10 : రామగుండం నగర పాలక సంస్థలో బయటకు రాని ఘటన ఒకటి మిస్టరీ వీడటం లేదు. మున్సిపల్ స్లాటర్ హౌస్ (జంతు వధశాల)లో దొంగలు పడి రూ. లక్షల విలువైన ఇనుప కిటికీలను ఎత్తుకెళ్లిన సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా దొంగలు బయటపడటం లేదు. స్లాటర్ హౌస్ పునర్నిర్మాణం జరిగి ప్రారంభంకు ముందే గుర్తు తెలియని దొంగలు భారీ స్కెచ్ వేశారు. స్లాటర్ హౌస్ తోపాటు ప్రక్కనే ఉన్న వీధి కుక్కల నియంత్రణ కేంద్రంలోని ఇనుప కిటికీలను, తలుపులను ఎత్తుకెళ్లారు.
చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పుటేజీకి చిక్కకుండా ఎత్తుకెళ్లడం ఏలా సాధ్యమైందో అంతుచిక్కడం లేదు. మొత్తానికి రాజుల సొమ్ము దొంగల పాలైంది… మరి ఆ దొంగతనం ఏలా జరిగింది.. స్కెచ్ గీసిందెవరు..? నిఘా నేత్రాలను తప్పించి అంత విలువైన సామగ్రిని ఏ దారి గుండా తీసుకెళ్లారు? అన్నది మాత్రం బయటకు రావడం లేదు. ఈ సంఘటన రామగుండం నగర పాలక సంస్థ పరువుకు సవాల్ గా పరిణమించింది .
గత బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం..
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సప్తగిరి కాలనీ శివారు, శ్రీనగర్ కాలనీ పరిధిలో స్లాటర్ హౌస్ (జంతు వధశాల)కు 12వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.43 లక్షలతో నిర్మాణం చేపట్టారు. కొంతకాలంకు ఈ స్లాటర్ హౌస్ శిథిలావస్థకు చేరుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవ తో టీయూఎఫ్ఐడీసీ ద్వారా స్లాటర్ హౌస్ పునర్నిర్మాణంతోపాటు యానిమల్ బర్డ్ కంట్రోల్ సెంటర్, ఎస్ టి పి తోపాటు రోడ్డు నిర్మాణంకు 2023లో రూ.1.80 కోట్లు నిధులు కేటాయించారు. ఎన్నికల కోడ్ మూలంగా పనులు మధ్యలో ఆగిపోగా అనంతరం స్లాటర్ హౌస్, వీధి కుక్కల నియంత్రణ కేంద్రం.
సిమెంట్ రోడ్డు పనులు కాంట్రాక్టర్ పూర్తి చేశారు. ఎస్టీపీ నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. చుట్టూ సీసీ కెమెరాలను బిగించారు. నగర పాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ లోపమో? మరేమో తెలియదు కానీ ఉన్నపలంగా రాత్రికి రాత్రే రూ. లక్షల విలువ చేసే ఇనుప కిటికీలు, తలుపులు, విలువైన సామగ్రి అంతా ఒక్కసారిగా మాయమై పోయాయి. దీనితో స్లాటర్ తిరిగి బూత్ బంగ్లాను తలపించేలా తయారైంది. పునఃప్రారంభం కాకముందే జరిగిన దొంగతనం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. స్లాటర్ హౌస్ గదులకు బిగించిన ఇనుప కిటికీలను ఎత్తుకెళ్లడం అంత తేలికైన పని కూడా కాదు.
దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులై ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ, దొంగలు అంత కష్టపడి గోడలను పగలగొట్టి మరీ కిటికీలను ఎత్తుకెళ్తున్నా ఎవరికీ కనిపించలేదా..? సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చోరీ ఏలా సాధ్యమైందనేది అంతుచిక్కడం లేదు. దొంగతనంకు పాల్పడిందెవరో కూడా కనిపెట్టే ప్రయత్నం చేయడం లేదు. బుధవారం స్లాటర్ హౌస్‌ను డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సందర్శించిన సందర్భంలో కిటికీలు మాయమైన సంఘటనను కూడా పెద్దగా పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విలువైన సామాగ్రి దొంగల పాలైన తర్వాత ఇప్పుడు అక్కడ వాచ్‌మెన్‌ను నియమించారు.
అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా..
కాగా, నగర శివారులో ఉన్న ఈ స్లాటర్ హౌస్ ప్రస్తుతం పాడు పనులకు అడ్డాగా మారింది. పడితే చాలు మందుబాబులు, గుర్తు తెలియని జంటలకు స్థావరంగా మారింది. మున్సిపల్ వాచ్మెన్ ఉదయం 6 గం.లకు వచ్చి మధ్యాహ్నం 3 గం.లకు విధులు ముగించుకొని వెళ్తుంటాడు. సాయంకాలం ఇక మందుబాబు లు అక్కడకు చేరుకొని అర్ధరాత్రి వరకు సిట్టింగ్లతో నానా హంగామా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన స్లాటర్ హౌస్ ఇప్పుడు బూత్ బంగ్లాను తలపించేలా మారింది.
ఆకతాయిలతోనే భయంగా ఉంది..: రేణిగుంట్ల సారయ్య, మున్సిపల్ వాచ్మెన్.
సాయంత్రం కాగానే మందు సీసాలతో వచ్చే ఆకతాయిలతో చాలా భయంగా ఉంటుంది. తాను డ్యూటీ ముగించుకొని వెళ్లడం చూసి వెనుకాల నుంచి లోపలికి వస్తున్నారు. ఆ విధంగానే దొంగలు కూడా వచ్చి అన్ని విలువైన ఇనుప కిటికీలను గోడలు పగులగొట్టి మరీ ఎత్తుకెళ్లి ఉంటారు. ఆ ఘటన జరిగిన తర్వాతనే తనకు ఇక్కడ డ్యూటీ వేశారు. సాయంకాలం వరకు కాపలాగా ఉంటున్నా. కానీ రాత్రి పూటనే గుర్తు తెలియని వ్యక్తులు వెనుకాల నుంచి లోపలికి వచ్చి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేశాం: జే. అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్.
జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఎఫ్ఎఆర్ కూడా నమోదైంది. కాకపోతే దొంగలు ఎవరనేది స్పష్టం కావడం లేదు. త్వరలోనే స్లాటర్ హౌస్ ను వినియోగంలోకి తీసుకవస్తాం. ఈసారి పకడ్బందీగా సీసీ కెమెరాలను కంట్రోల్ రూంకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్