పెద్దపల్లి : పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్(Tehsildar) , ఇద్దరు ప్రైవేట్ సిబ్బందిని ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కల్వశ్రీరాంపూర్ మండల తహసీల్దార్ మహ్మద్ జాహెద్ పాషా(Mohammed Zahed Pasha)తో పాటు అతడి వద్ద ప్రైవేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాసరి ధర్మేందర్, ప్రైవేట్ డ్రైవర్ మహ్మద్ అంజాద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కడెం తిరుపతి అనే వ్యక్తి తన తండ్రిపేరుపై ఉన్న పట్టాను తనపై మ్యుటేషన్ చేసి పట్టాదారు పుస్తకం మ్యాన్వల్గా తనకు ఇవ్వాలని తహసీల్దార్‌ను సంప్రదించాడు. దీంతో డబ్బులు డిమాండ్ చేయగా శనివారం దాసరి ధర్మేందర్ రూ . 3 వేలు, డ్రైవర్ మహ్మద్ అంజాద్ రూ. 7 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఇద్దరిని పట్టుకున్నారు. ఈ కేసులో తహసీల్దార్ మహ్మద్ జాహెద్ పాషా ప్రమేయం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని అధికారులు వివరించారు.