సుల్తానాబాద్ రూరల్,మే 06 : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీ స్వప్నరాణి అన్నారు. మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ సెక్రటరీ రణధీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వప్నరాణి హాజరై మాట్లాడారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందాలనే ఉద్దేశంతో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఉద్యోగస్తులు, రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు దాటని యువకులు లైసెన్స్ లు లేకుండా రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి కారణమైన యువకుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరకట్న వేధింపులు, భూ తగాదాలు, గృహహింస కేసుల చట్టాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ కేసులలో నేరం నమోదు అయితే కఠినపరమైన శిక్షలు తప్పవని పేర్కొన్నారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.